గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (18:55 IST)

మందుబాబులకు షాకివ్వనున్న సీఎం జగన్... (Video)

వైకాపా అధినేత, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మందుబాబులకు షాకివ్వనున్నారు. ఇప్పటివరకు తాను ఇచ్చిన నవరత్నాల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వచ్చారు. దీంతో అన్ని వర్గాల వారు సీఎం జగన్ పనితీరును మెచ్చుకుంటున్నారు. 
 
కానీ మందుబాబుల విషయానికి వచ్చేసరికి ఆయన యు టర్న్ తీసుకున్నారు. తాను ఇచ్చిన హామీల్లో భాగంగా ఏపీలో మద్య నిషేధం అమల్లో భాగంగా తొలి అడుగు వేయనున్నారు. ఇందులోభాగంగా, మద్యం షాపులు తెరిచివుంచేందుకు ఓ నిర్ధేశిత సమయాన్ని నిర్ణయించనున్నారు. 
 
ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తున్నట్టుగానే ఇకపై మద్యం షాపులు కూడా పని చేయనున్నాయి. అంటే ఉదయం 10 గంటలకు తెరిచివుంచి, సాయంత్రం 6 గంటలకు మూసివేసేలా త్వరలో ఆదేశాలు జారీచేయనున్నారు. దీనివల్ల నాలుగు గంటల మేరకు మద్యం అమ్మకాలు తగ్గనున్నాయి. ఫలితంగా సాధారణ అమ్మకాలతో పోల్చితే మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో తగ్గిపోతాయని అబ్కారీ శాఖ అధికారులు భావిస్తున్నారు. 
 
నిజానికి ఉదయం కంటే సాయంత్రమే మద్యం అమ్మకాలు విరివిగా జరుగుతాయి. ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఎవరైనా సరే... రాత్రి వేళల్లోనే ఎక్కువగా మద్యం తాగుతారు. రాత్రి పూట మద్యం షాపులు కిక్కిరిసిపోతాయి. దీంతో, 6 గంటలకు మద్యం షాపులను బంద్ చేస్తే... మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం యోచిస్తోంది. అక్టోబరు నుంచి నూతన పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, పలు ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చితే... మందుబాబులకు కొత్త కష్టాలు వచ్చినట్టే.