ఏపీ రాజధాని అమరావతే... క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కారు (video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగనుంది. ఈ మేరకు శాసనమండలిలో ఏపీ పురపాలక శాఖామంత్రి క్లారిటీ ఇచ్చారు. తద్వారా రాజధాని అమరావతి మారుస్తారంటూ ఇంతకాలం సాగిన ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పడినట్టు అయింది.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఎమ్మెల్సీలు శ్రీమతి పమిడి శమంతకమణి, గునపాటి దీపక్ కుమార్, పర్చూరి అశోక్ బాబు.. రాజధాని తరలింపు అంశంపై మండలిలో పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు అమరావతి నుంచి రాజధానిని మార్చడం లేదంటూ ఆయన లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు.
మరోవైపు, జగన్ సర్కార్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రాజధానికి అమరావతి సరైన ప్రాంతం కాదని.. నిపుణుల కమీటీ రాష్ట్రమంతా పర్యటించి.. రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలో అన్న దానిపై సమగ్రమైన నివేదిక ఇస్తుందన్న చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నిపుణుల కమిటీ సర్వే కూడా పూర్తయింది. ఇక కొద్దిరోజుల్లో వైసీపీ ప్రభుత్వం రాజధాని అంశంపై పూర్తి క్లారిటీ ఇస్తుందన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో లిఖితపూర్వకంగా రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచన లేదని మరోసారి స్పష్టం చేసింది.