శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (05:42 IST)

ఎక్కడా అవినీతి కనిపించకూడదు:జగన్‌

రాష్ట్రంలో లంచాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, ఎమ్మార్వో కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసుల్లో ఎక్కడా అవినీతి కనిపించకూడదని, లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
 
రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యల విషయంలో ఏసీబీ పనితీరు ఆశించిన మేర లేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకోసం ఏసీబీ అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలకంగా.. అంకిత భావంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని, అవినీతి తిమింగలాల భరతం పట్టాలని ఏసీబీ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఏసీబీ(అవినీతి నిరోధక విభాగం) పనితీరుపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి నిరోధానికి 14400 కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. దాని ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కాల్‌ సెంటర్‌ ఏర్పాటు వల్ల ఆశించిన ఫలితాలు కనిపించాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రజలెవరూ అవినీతి బారిన పడకూడదనే ఉద్దేశంతోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఏసీబీ0 అధికారులకు వివరించారు. సెలవులు లేకుండా పనిచేసి, మూడు నెలల్లోగా స్పష్టమైన మార్పు చూపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అందుకోసం అవసరమైన మేర సిబ్బందిని తీసుకోవాలని, ఎలాంటి సదుపాయాలు కావాలన్న ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. మరో నెలరోజుల్లో పనితీరును మళ్లీ సమీక్షిస్తానని చెప్పారు. సమావేశంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్,  ఏసీబీ చీఫ్‌ విశ్వజిత్‌ తదితరులు పాల్గొన్నారు.