శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (05:22 IST)

జగన్ తెలివి తక్కువ వాడు: దేవినేని ఉమ

నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలంలోని జుజ్జూరు గ్రామంలో అమరావతి రాజధానిగా కొనసాగించాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సందర్భంగా దీక్షా శిబిరాన్ని మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్యతో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి వారికి తన సంఘీభావం తెలియజేశారు.
 
ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని జగన్ సంపూర్ణంగా ఆహ్వానించారని, 30 వేల ఎకరాలు కావాలి అని శాసనసభ సాక్షిగా చెప్పారని అన్నారు.  రైతులు 33 వేల ఎకరాలను రాజధానికి ఇచ్చారని, అది ప్రభుత్వానికి ఇచ్చారు కానీ ఏ ఒక్కరి వ్యక్తిగత అవసరాల కోసం కాదని అన్నారు.

రైతుల రక్షణ కోసం సిఆర్డిఏ చట్టాన్ని పకడ్బందీగా చేశామని, నేడు ప్రాంతీయతత్వం రెచ్చగొట్టే  విధంగా జగన్ మోహన్ రెడ్డి 3రాజధానుల పాట పాడుతున్నాడని అన్నారు. తన వైఫల్యాలను చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి  రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.
 
 రాజధాని తరలింపును సహించబోమని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి తమ రాజధానిని కాపాడుకుంటారని దేవినేని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు విన్న అధికారులంతా ఇప్పుడు జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట విని సంతకాలు పెడుతున్న అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

రహస్య జీవోలపై సంతకాలు చేసిన వారిపై భవిష్యత్తులో సీబీఐ విచారణ జరుగుతుందని అన్నారు.  వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పాలనలో జగన్‌, విజయ సాయిరెడ్డిల మాటలు విని, సంతకాలు పెట్టిన అధికారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో గుర్తు చేసుకోవాలని దేవినేని ఉమ అన్నారు.

పోస్టింగ్‌ కోసం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇప్పటికీ ఢిల్లీలో కేంద్రమంత్రులు, పార్లమెంటు చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. అధికారులు తొందరపడి జీవోలపై సంతకాలు పెట్టకూడదని సూచించారు.

జగన్ తెలివి తక్కువ వాడని, అటువంటి వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు. రాజధానిపై జగన్ తీరు సరికాదని అన్నారు. అమరావతి ఎపికి రాజధాని అని దేవినేని స్పష్టం చేశారు.