సీఎం కుర్చీని గట్టిగా అడిగి తీసుకోగల బలం జనసేనకు లేదు.. పవన్
సీఎం కుర్చీ గట్టిగా అడిగి తీసుకోగల బలం ప్రస్తుతానికి జనసేనకు లేదని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ నుంచి ఏపీని విముక్తం చేయడమే తమ ప్రధాన అజెండా అని ఈ దిశగా కలిసివచ్చే పార్టీలతోనే తమ పొత్తు ఉంటుందని తెలిపారు.
తనకు లెఫ్ట్ పార్టీలు, రైట్ పార్టీలు అనే తేడా లేదని, అందరినీ కలుపుకుని వెళ్లాలనేది తన మనస్తత్వం అని వెల్లడించారు. అయితే కమ్యూనిస్టు పార్టీలతో బీజేపీ కలవదని, బీజేపీతో కమ్యూనిస్టు పార్టీలు కలవవని, వారి మధ్య సైద్ధాంతిక వైరుధ్యం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు.
సినిమాల్లో సూపర్ స్టార్ హోదా తనకు తానే తెచ్చుకుందేనని.. రాజకీయాల్లో కూడా అంతేనని తెలిపారు. తనను సీఎంను చేస్తామని బీజేపీ, టీడీపీ ఎందుకు అంటాయి? రాజకీయాల్లో తనకు తానుగా కష్టపడి ఆ స్థాయికి చేరాల్సిందేనని పవన్ వెల్లడించారు.