1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 16 అక్టోబరు 2021 (10:21 IST)

గాంధీ స్థూపానికి ఎన్.ఎస్.జి. క‌మెండోల శాల్యూట్!

భార‌త‌ స్వాతంత్ర ఉద్య‌మ ప్ర‌తీక అయిన విజ‌య‌వాడ గాంధీ హిల్స్ సాక్షిగా బ్యాక్ క్యాట్ క‌మెండోల ర్యాలీ కొన‌సాగుతోంది. జాతి పిత మ‌హాత్మా గాంధీ స్తూపానికి నివాళి అర్పించి, ఎన్.ఎస్.జి. క‌మెండోలు త‌మ దేశ భ‌క్తిని చాటారు. మాజీ ప్ర‌ధానులు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి,  మొరార్జీ దేశాయ్ స్థాపించిన గాంధీ హిల్స్ సంద‌ర్శించ‌డం త‌మ‌కెంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని బ్యాక్ క్యాట్ క‌మెండోలు చెపుతున్నారు. 
 
ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, బ్లాక్ క్యాట్ కమాండో ఆధ్వర్యంలో చేపట్టిన సుదర్శన్ భారత్ పరిక్రమ కార్ ర్యాలీ విశాఖ నుంచి విజ‌య‌వాడ‌కు చేరింది. 
అక్టోబర్ 2న ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ ర్యాలీని ప్రారంభించారు. నిన్న‌ విశాఖ నుంచి విజ‌య‌వాడ‌కు చేరిన ర్యాలీ ఇక్క‌డి నుంచి హైద‌రాబాదు మీదగా  ఈనెల 30న తిరిగి ఢిల్లీకి చేరుకోనుంది. దేశవ్యాప్తంగా సుమారు 7,500 కిలోమీటర్ల మేర 18 పట్టణాలను కలుపుతూ ఈ ర్యాలీ కొనసాగుతుంది.
 
బ్యాక్ క్యాట్ క‌మెండోలు విజ‌య‌వాడ గాంధీ హిల్స్ లో స్మార‌క స్తూపానికి శ్యాల్యూట్ చేశారు. స్వాతంత్ర ఉద్య‌మ చిహ్నంగా పేరొందిన గాంధీ హిల్స్ మెమోరియ‌ల్ ని 1967 లో మాజీ ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్ ప్రారంభించారు. అంత‌కు ముందు 1964లో మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి దీనికి శంకుస్థాప‌న చేశారు. 1968లో మాజీ రాష్ట్ర‌ప‌తి డా. జాకీర్ హుస్సేన్ గాంధీ 52 అడుగులు స్తూపాన్ని ఆవిష్క‌రించారు. మ‌హాత్మా గాంధీజీ  1919-1946 మ‌ధ్య విజ‌య‌వాడ‌కు 6 సార్లు వ‌చ్చారు.  ఇంత‌టి స్పూర్తి వంత‌మైన గాంధీ హిల్స్ ని సంద‌ర్శించ‌డం త‌మకెంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని క‌మాండెంట్ ఓ.ఎస్. రాథోడ్ వెబ్ దునియాకు వివ‌రించారు.