శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (10:02 IST)

ఏపీ - తెలంగాణాల్లో భారీ వర్షాలు - ఒడిశాలో ఎల్లో అలెర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు ఐఎండీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే, ఒడిశా రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీచేసింది.
 
తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. కేరళలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. 
 
శనివారం ఆంధ్రప్రదేశ్‌లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ అధికారులు సూచించారు. ఉత్తర కోస్తాంధ్రలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
 
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశముందని, రాజధాని నగరమైన హైదరాబాద్ నగరంలో శనివారం ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
 
తెలంగాణాలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి, గంజాం, రాయగడ, కోరాపుట్ మరియు మల్కన్ గిరి జిల్లాల్లో శనివారం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. 
 
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో అక్టోబర్ 19 వరకు ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరిక జారీచేసింది.