శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మార్చి 2024 (10:08 IST)

ఏపీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగరా.... మొత్తం ఓటర్లు ఎంతమంది?

andhra pradesh map
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగరా మోగింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్‌తో పాటు 25 లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. అయితే, ఏపీలో ఉన్న మొత్తం 175 స్థానాల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయి. అలాగే 25 లోక్‌సభ స్థానాల్లో నాలుగు ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానం ఉన్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 4.09 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో 2 కోట్ల మంది పురుష ఓటర్లు కాగా... మహిళా ఓటర్లు 2.08 కోట్ల మంది ఉన్నారు. రాష్ట్రంలో 3,346 మంది హిజ్రా ఓటర్లు ఉన్నారు. ఏపీలో ఉన్న సర్వీస్ ఓటర్ల సంఖ్య 67,434. ఎన్నారై ఓటర్ల సంఖ్య 7,603. 
 
మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్‌సభకు ఒకే విడతలో జరిగే ఎన్నికల కోసం రాష్ట్రం మొత్తమ్మీద 46,165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిగా మహిళలతో నిర్వహించే పోలింగ్ కేంద్రాలు 179 కాగా... పూర్తిగా యువతతో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో మొత్తం ఆదర్శ పోలింగ్ కేంద్రాల సంఖ్య 555 అని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. 
 
అలాగే, ఎలక్ట్రోలక్ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఎపిక్)లను మార్చి నెలాఖరుకు పంపిణీ చేస్తారు. ఓటర్ల సమాచార స్లిప్పులను పోలింగ్ తేదీకి ఐదు రోజుల ముందుగా పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా వెల్లడించారు.