పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 38 మంది వరకు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూదన రావు వున్నట్లు గుర్తించారు. ఆయన బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు తెలిపింది.
మధుసూదన్ రావు కుటుంబం అక్కడే స్థిరపడింది. పహల్గామ్‌కు విహార యాత్రకు వెళ్లగా మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబం పవహల్గామ్ బయలుదేరి వెళ్లిందని సమాచారం. ఇక ఇదే దాడిలో విశాఖపట్టణం వాసి, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి కూడా మృతి చెందారు.
పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారిని గుర్తింపు... ఫోటో రిలీజ్!
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలోని పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదిని జాతీయ మీడియా సంస్థలు గుర్తించి ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఫోటోలో ఉగ్రవాది రైఫిల్ పట్టుకుని పరుగెత్తుతూ కనిపించాడు. అతను ఆయుధాలు పట్టుకుని పఠానీ సూట్ ధరించి కనిపించాడు. ఈ ఫోటోను మంగళవారం రాత్రి 1 నుంచి 2 గంటల ప్రాంతంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, సైన్యంతో పంచుకున్నట్టు సమాచారం.
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో కనీసం 26 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. కాగా, ఈ దాడిలో 8 నుంచి 10 మంది ఉగ్రమూకలు పాల్గొన్నట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వారిలో 5 నుంచి 7 మంది దాయాది పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు పేర్కొంటున్నాయి. కాల్పుల తర్వాత సమీపంలోని అడవిలోకి పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
ఇక ట్రెక్కింగ్ యాత్ర కోసం సుందరమైన బైసరన్ లోయను సందర్శిస్తున్న పర్యాటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ దాడి జరిగిందని అధికారులు నిర్ధారించారు. గుర్తు తెలియని దుండగులు ఉన్నట్టుండి ఒక్కసారిగా సందర్శకులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.