ఎపిలో ఆపరేషన్ గరుడ పార్ట్ - బి... ఏయే నేతలున్నారో చూడండి..!
ఆపరేషన్ గరుడ పార్ట్ - బి ప్రారంభమైందా.. ఈసారి కేంద్రం టార్గెట్ చేయబోయే నేతలెవరు. అసలు పార్ట్ - బిని అమలు చేస్తున్నారని చెప్పిన వ్యక్తి ఎవరు.. ఆపరేషన్ గరుడ మొదటి పార్ట్‌తోనే వణికిపోతున్న టిడిపి నేతలు ప్లాన్ బిని ఎలా ఎదుర్కొంటారు.
ఆపరేషన్ గరుడ. ఈ పేరు చెప్పిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రప్రభుత్వం చేయిస్తున్న దాడుల గురించి వెంటనే గుర్తుకు వస్తుంది. ఐటీ దాడులతో వరుసగా తెలుగుదేశం పార్టీ నేతల్లో వణుకు పుట్టించింది కేంద్ర ప్రభుత్వం. మొదటగా మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఆ తరువాత సిఎం రమేష్, అలాగే పేరం హరిబాబు.. ఇలా ఒక్కరేమిటి టిడిపికి సపోర్టుగా ఉండే పారిశ్రామికవేత్తలపైనా ఐటీ దాడులు కేంద్రప్రభుత్వం చేయించిందనేది విశ్లేషకుల భావన.
ఆపరేషన్ గరుడ పేరు బయటకు చెప్పింది సినీ నటుడు శివాజీనే. బిజెపిలో రాజకీయ నేతగా ఉన్న శివాజీ ఆ తరువాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాటం కూడా చేస్తున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో చంద్రబాబును అరెస్టు చేయించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు శివాజీ.
నటుడు శివాజీ చెప్పినట్లుగానే ఒక్కో టిడిపి నేతపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. సొంతంగా ఉండాల్సిన ప్రభుత్వ సంస్ధలను తన జాగీరులా కేంద్రం మార్చేసుకుందన్న విమర్సలు వినిపించాయి. సరిగ్గా శివాజీ ఏది చెబితే అది జరుగుతూ వచ్చింది. దీంతో ఆపరేషన్ గరుడ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇదిలా జరుగుతుండగానే తాజాగా సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. అదే ఆపరేషన్ గరుడ పార్ట్ బి. త్వరలో టిడిపికి చెందిన 30 మంది నేతలపైన కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు చేశారు. టిడిపికి చెందిన మంత్రులు, ఆ పార్టీకి మద్దతు తెలిపే నేతలు అందరిపైనా ఐటీ దాడులు జరుగుతాయని చెప్పారు. దీంతో ఎపిలో మరోసారి అలజడి రేగింది. కేంద్రం ఆపరేషన్ గరుడ పార్ట్ -2 ప్రారంభించదని నిర్ణయానికి వచ్చేశారు.
గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఆపరేషన్ గరుడ పార్ట్ - బి పైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కేంద్రం ఈసారి ఎవరిపైన ఐటీ దాడులు చేయిస్తుందన్న భయంతో ఆ పార్టీ నేతలు ఆలోచనలో పడిపోయారు. మరి ఆ లిస్టులో ఎవరు వున్నారో అంటూ అంతా భుజాలు తడుముకుంటున్నట్లు తెలుస్తోంది.