శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (12:01 IST)

పంచాయతీ ఎన్నికలు.. వైసీపీలో గుబులు

పంచాయతీ ఎన్నికల పోరు అధికార వైసీపీలో గుబులు రేపుతోంది. విజయావకాశాల మాటేమోగానీ పార్టీలో ద్వితీయ శ్రేణి కేడర్‌ నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహం, అసంతృప్తి చేటుచేయడం ఖాయమనే ఆందోళన వెన్నాడుతోంది.

ముఖ్యంగా నియోజకవర్గాల్లోని మెజారిటీ పంచాయతీల్లో నెగ్గుకురావడం వైసీపీ ఎమ్మెల్యేల బాధ్యత కావడంతో ఇప్పుడు వీరంతా తలలు పట్టుకుంటున్నారు. అనుకున్న లక్ష్యానికి గ్రూపుల గోల చేటు చేసే ప్రమాదం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేపేరుతో ఎడాపెడా చేరికలు జరిపించేశారు. దీంతో అప్పటికే ఉన్న పార్టీ కేడర్‌కు తోడు కొత్త నేతలు రావడంతో రెండు వర్గాలకు కొంతకాలంగా పొసగడం లేదు.

అన్నింటికీ మించి పథకాలు, పనులు, కాంట్రాక్టుల్లో ఎక్కడికక్కడ ఇంతకాలం కీలక నేతలు తమ లాభం చూసుకున్నారు. దిగువ స్థాయి నేతలను పట్టించుకోలేదు. దీంతో భగభగమంటున్న వీరంతా నేతలకు ఇప్పుడు చెమటలు పట్టిస్తున్నారు.
 
పంచాయతీ ఎన్నికలు వద్దనుకున్నా వచ్చిపడడంతో అధికార వైసీపీలో గుబులు రేపుతోంది. ఎక్కడికక్కడ జిల్లా పార్టీలు గ్రూపులు, అసమ్మతి, నేతల మధ్య పోరు తీవ్రంగా ఉన్న సమయంలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడం కొంత ఇబ్బందిగా మారింది.

ఎన్నికలకు సుప్రీంకోర్టు సోమవారం పచ్చజెండా ఊపడంతో ఎస్‌ఈసీ ఎన్నికల రీషెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పుడిది ఎమ్మెల్యేలకు సంకటంగా మారింది. ఎన్నికలు అసలు జరగవని మానసికంగా సిద్ధమైన తరుణంలో అనుహ్యంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి రావడంతో ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నారు.

వీటిని గ్రామస్థాయిలో ఎదుర్కోవడంలో క్షేత్రస్థాయి నేతలే కీలకం కావడంతో సోమవారం రాత్రి నుంచి మండలాల వారీగా పార్టీ నేతలను ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పిలిపించుకుని సమావేశాలు ప్రారంభించారు. తీరా అనేకచోట్ల పరిస్థితులు వేడిపుట్టిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడ గ్రూపులు, అసమ్మతి, నేతల మధ్య పంచాయతీలు బహిర్గతం అవుతుండడంతో సర్దుబాటు చేయడం తలనొప్పిగా మారింది. ఒకరకంగా ఇది ప్రత్యర్థికి మేలు చేకూరుస్తుందేమోననే ఆందోళన చెందేలా చేస్తోంది. 
 
తొలి విడత ఎన్నికలు జరిగే కాకినాడ రూరల్‌, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో పలు చోట్ల పార్టీలు గ్రూపులు వైసీపీ ఎమ్మెల్యేలకు కునుకులేకుండా చేస్తున్నాయి. రామచంద్రపురం, రాజమహేంద్రవరం రూరల్‌, పి.గన్నవరం, అమలాపురం, రాజానగరం, కొత్తపేట నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ చోట్ల టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి నేతలను ఎడాపెడా ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు.

కానీ ఇంత వరకు వీరికి ఇచ్చిన అంతర్గత హామీలను తీర్చలేదు. అటు వీరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారంటూ ముందు నుంచీ ఉన్న కేడర్‌ అభ్యంతరం తెలుపుతోంది. దీంతో ఈ రెండు గ్రూపుల్లో ఎవరినీ నియంత్రించలేక ఎమ్మెల్యేలు ఇంతకాలం వారి జోలికి వెళ్లలేదు. తీరా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని హితవు పలుకుతున్నా వినే పరిస్థితి లేదు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొందరు నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎన్నికలకు ఉద్దేశపూర్వకంగా అందుబాటులో లేకుండా మాయం అయ్యారు. కాకినాడ రూరల్‌లో సర్పవరం, తిమ్మాపురం గ్రామాలు, కరప మండలంలో గ్రూపులు మంత్రి కన్నబాబు పంటికింద రాయిలా మారాయి.
 
పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో వైసీపీకి  ఎమ్మెల్యే లేకపోవడం, ఇన్చార్జి ఉన్నా ఆయన నాయకత్వంపై అసమ్మతి నేపథ్యంలో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. దీంతో ఇక్కడ నెట్టుకురావడం కష్టంగా మారింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం, ప్రత్తిపాడు, రౌతులపూడి మండలాల్లో పార్టీలో గ్రూపుల సర్దుబాటు తలనొప్పిగా మారింది.

తునిలో ఎమ్మెల్యే తీరుపై కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. రాజమహేంద్రవరం రూరల్‌లో నాయకత్వ సమస్యతో గ్రూపులు వేధిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం రూరల్‌లో నేతల మధ్య విబేధాలు కొలిక్కిరావడం లేదు. పి.గన్నవరం, అమలాపురం, కొత్తపేటల్లోనూ ద్వితీయ శ్రేణి కేడర్‌లో గ్రూపుల గోల పరిష్కారం కాకుండా ఉంది.