శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2024 (17:25 IST)

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

lokesh - paritala
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే పరిటాల సునీత రెండో రోజు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుతో పాటు పలువురు మంత్రులను కలిశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆమె శుక్రవారం మంత్రులు నారా లోకేష్, అచ్చన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీని కలిశారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి వివరించారు. 
 
గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాల పేరుతో ప్రకాష్ రెడ్డికి సంబంధించిన రాక్రీట్ సంస్థ చేసిన దోపిడీ, పింఛన్లు, రేషన్ కార్డుల తొలగింపు, భూ అక్రమాలు వంటి వాటి గురించి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై ఖచ్చితంగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడుని కలిసి రైతు సమస్యలపై విజ్ఞప్తి చేశారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వడంతో పాటు 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా 90 శాతం సబ్సిడీ డ్రిప్ మంజూరు చేయాలన్నారు. 
 
కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సబ్సిడీలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో తెలుగు దేశం పార్టీ సానుభూతిపరుల రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించారని.. నేటికీ అవి పునరుద్దరించలేదన్నారు. దీని వలన చాలా మంది పార్టీ సానుభూతి పరులు నష్టపోతున్నారన్నారు. కొత్త పథకాలకు కూడా అర్హత కోల్పోతున్నారని వివరించారు. రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి ఆత్మకూరు, అనంతపురం రూరల్ తహసీల్దార్ కార్యాలయాలకు భవనాలు మంజూరు చేయాలన్నారు. 
 
డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఓఎస్డీని కలిశారు. పండమేరు బ్రిడ్జి నిర్మాణానికి 1.8 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో పలు గ్రామాలకు రోడ్లు మంజూరు, పెండింగులో ఉన్న త్రాగునీటి పథకాల అంశాల గురించి వివరించారు. వీటిన్నింటిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు.