ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (14:57 IST)

నకిలీ ఓట్ల వ్యవహారం.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న ఏపీ మంత్రులు

election commission
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో చాలా మంది సీమాంధ్రులకు ఓటు హక్కు ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్లు గెలుపును నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. 
 
అయితే తెలంగాణలో ఓటు హక్కు ఉన్న వారందరికీ ఏపీలో ఓటు హక్కు ఉంది. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఈరోజు భేటీ కానున్నారు. 
 
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నకిలీ ఓట్లు, ఓట్ల తొలగింపుపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. 
 
నకిలీ ఓట్ల నమోదుకు వైసీపీయే కారణమంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ కౌంటర్‌ ఇస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నమోదైన నకిలీ ఓట్లను తొలగించాలని ఈసీని కోరడం ద్వారా.. ఓటర్ల నమోదులో తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని వైసీపీ వెల్లడిస్తోంది. 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి తెలంగాణ పాలిట ప్రభావం ఏపీ ఎన్నికలపై పడకుండా వైసిపి జాగ్రత్తపడుతోంది. ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్లు ఎక్కడో ఒక చోట ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని వైసీపీ నేతలు ఈసీని కోరనున్నారు.
 
ఏపీలో భారీగా నకిలీ ఓట్లు నమోదయ్యాయని టీడీపీ నేతలు ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు దొంగ ఓట్లను నమోదు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ నకిలీ ఓట్లపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశారు. 
 
నకిలీ ఓట్ల నమోదుపై వైసీపీ కూడా పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేసింది. సీఈవో మీనాకు మరోసారి ఫిర్యాదు చేయనున్నారు ఏపీ మంత్రులు.