ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By వరుణ్

రైతు బంధు పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

rythu bandhu funds
తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయితే, ఈ నెల 28వ తేదీలోపు మాత్రమే ఈ నిధులను పంపిణీ చేయాలన్న షరతు విధించింది. యాసంగి సీజన్ కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి ఈ నెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు అయిదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. 
 
ఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. రాష్ట్రంలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్ ఆరంభానికి ముందు నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. ఈసారి శాసనసభ ఎన్నికల దృష్ట్యా కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు. 
 
ఇది కొనసాగుతున్న పథకమని కోడ్ వర్తించదని... యథావిధిగా ఈ సాయం విడుదలకు అనుమతించాలని ప్రభుత్వం గత నెలలో ఈసీని కోరుతూ లేఖ రాసింది. పరిశీలించిన ఈసీ తాజాగా నిధుల జమకు అనుమతి మంజూరు చేసింది. 28 సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తున్నందున.. అప్పటి నుంచి ఈ నెల 30న పోలింగ్ ముగిసే వరకు నిధులను జమ చేయవద్దని ఆదేశించింది. ఈసీ అనుమతించడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో శనివారం నుంచి సొమ్ము జమ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ మొత్తం రూ.7,700 కోట్లకు పైగా ఉంటుంది.