శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : రాజకీయ పార్టీలకు షాకిచ్చిన ఎన్నికల సంఘం

election commission
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ నేతలు భారత ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చాయి. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార ప్రకటనలు తక్షణ నిలిపివేయాలని మీడియా, సోషల్ మీడియా చానెళ్లకు లేఖలు రాసింది. అలాగే, నేతలు ఇష్టారీతిన నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు జారీ చేస్తున్నారని, ఎన్నికల కోడ్ ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
 
ఎన్నికలు నిబంధనలు ఉల్లఘించే వారిపై కేసు నమోదు తప్పదని హెచ్చరించారు. అలా ఒక్కసారి కేసు నమోదైతే అది కొన్నేళ్లపాటు వెంటాడుతూనే ఉంటుంది. నేరం నిరూపితమైతే తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత ప్రచారం చేసినా.. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినా.. చివరకు ప్రచార గోడపత్రికలు అతికించినా.. పెద్దశబ్దంతో డీజేలు పెట్టినా.. ట్రాఫిక్కు అంతరాయం కలిగించినా.. ప్రభుత్వ పథకాలను రాజకీయ ప్రచారం కోసం వాడుకున్నా.. కేసులు నమోదవుతాయి. 
 
కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత గత నెల 10వ తేదీ నుంచి ఈ నెల 10 వరకు (నెల రోజుల్లో) రాష్ట్రంలో ఈ తరహా కేసులు 426 నమోదయ్యాయి. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, సర్వైలెన్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ కేసులు నమోదు చేస్తున్నారు. 
 
కేసులది ఏముందిలే.. అని చాలామంది బాహాటంగానే నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. కానీ అవి నమోదైతే కొన్నేళ్లపాటు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సదరు నాయకులు ఎన్నికల్లో పాల్గొన్న ప్రతిసారీ ఈ కేసుల గురించి ప్రస్తావించాలి. కొన్ని ప్రభుత్వ పథకాల వంటివి పొందాలన్నా కేసుల ప్రస్తావన తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా పోలీసుశాఖలోకి ఎంపిక కావాలంటే కేసులు ఖచ్చితంగా అడ్డంకిగా మారతాయి. ఇక పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే ఈ కేసులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించడం అవసరం.
 
షేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్‌లో ఓ పార్టీ నాయకుడు 50 మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో స్టాటిక్ సర్వ్‌లైన్స్ బృందం గుర్తించింది. ర్యాలీ నిర్వహిస్తున్న నాయకుడితోపాటు ఆయన పార్టీపైనా గత నెల 12న కేసు నమోదైంది.
 
కాచిగూడలోని ఓ పాఠశాలలో ఓ పార్టీ నాయకుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో అనుమతి లేకుండా పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే కాబట్టి పోలీసులు కేసు నమోదు చేశారు.