గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (10:32 IST)

తెనాని కోటపై జనసేన జెండా ఎగరాల్సిందే... శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపు

pawan - nadendla
వచ్చే 2024 ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన జెండా ఎగురాలని పార్టీ శ్రేణులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌ని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమన్నారు. ఈ మేరకు ఆయన రెండు పేజీలతో కూడిన ఓ ప్రకటనను విడుదల చేశారు. 
 
తెనాలి సీటు, అక్కడ గెలుపూ మనదే అని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ అసెంబ్లీని ఎంతో సమర్ధంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి సమర్థ నాయకుడినీ, ఎన్నుకున్న నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధినీ తెనాలి ప్రజలు ఎప్పటికీ మరచిపోరు అని చెప్పారు. 
 
మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆత్మీయంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులను ఒక్కక్కరినీ మనోహర్ పరిచయం చేశారు. 
 
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "మనోహర్ తన హయాంలో చేసిన సేవలను తెనాలి నియోజకవర్గం ప్రజలు విస్మరించలేదు. ఇప్పటికీ నియోజకవర్గం అభ్యున్నతి కోసం తపిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెనాలికి ఆయన అవసరం ఉంది. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా పాలక పక్షం ఆలోచిస్తుంది. 
 
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు అంటారు.. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు... నేను బాగుండాలి.. నేనే బాగుపడిపోవాలి అనేది వైసీపీ నాయకుడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి. దాన్ని నేనెప్పుడో గ్రహించాను కాబట్టే మొదటి నుంచీ వైసీపీని వ్యతిరేకిస్తున్నాను. ప్రజలు మాత్రం ఎంతో సానుభూతితో తండ్రి లేని పిల్లాడు.. సంవత్సరం నుంచి నడుస్తున్నాడని జాలితో ఓట్లు వేశారు. ఇప్పుడు దానికి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడుతున్నారు. 
 
వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం ఆంధ్రప్రదేశ్‌కు స్థిరత్వం ఇవ్వాలని బలమైన కాంక్షతోనే జనసేన పార్టీ పనిచేస్తుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి అనేదే ప్రాథమిక ఎజెండాగా ఎలా ఎదగాలన్నది నాయకులు పట్టించుకోలేదు. కేవలం వారి వ్యక్తిగత ఎదుగుదల తప్ప, ప్రజా క్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయం మీద నిబద్ధతతో నిలబడి ఉంది. నేను ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినా, ఇక్కడ మాట్లాడినా విభజన తర్వాత రెండు రాష్ట్రాలు
 
ఎలా అభివృద్ధి వైపు వెళ్లాలని అంశాలు, కేంద్రం అందించాల్సిన సాయం మీద మాట్లాడుతాను. మేం చెప్పే ప్రతి మాట రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని చెబుతున్నదే. అర్థశాస్త్రంలో పన్నులను ఎలా విధించాలనే అంశంపై నిపుణులు చెబుతూ 'పూల మీద మకరందం తీసుకునే సీతాకోకచిలుకలా ప్రభుత్వం పన్నుల విషయంలో వ్యవహరించాల'ని తెలిపారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. చెత్తపైనా పన్ను వేసిన ప్రభుత్వం ఇది. 
 
ప్రజలపై ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వేస్తూ, ఆ డబ్బుతో సంక్షేమం అంటే ఎలా..? అది ఎలా ప్రజలకు మేలు చేస్తుంది..? ఓ పద్ధతి లేకుండా చేస్తున్న వైసీపీ పాలన వల్ల రాష్ట్రం పది అడుగులు వెనక్కు వెళుతున్నాం. ప్రజలు కులం, మతం, ప్రాంతం దాటి ఆలోచించకపోతే పూర్తిగా రాష్ట్ర ప్రజల ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
 
రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ పాలనపరమైన ఇబ్బందులు అలాగే ఉన్నాయి. మన వ్యవస్థ ఇప్పటికీ సర్దుబాటు కాలేదు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఎలాంటి అరమరికలు లేకుండా సాఫీగా పాలన సాగించలేని స్థితిలో ఉండిపోయాం అన్నారు. 
 
నిజాయతీగల వ్యక్తుల సమూహం జనసేన : నాదెండ్ల మనోహర్ 
 
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... పార్టీలో నిజాయతీనే బలంగా చేసుకున్న నాయకులే కనిపిస్తారు. అరమరికలు లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లేలా పనిచేయాలి. అందరినీ సమన్వయం చేసుకోవాలి. ప్రస్తుతం కొత్త ఓట్ల చేర్పులు, మార్పులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆయా నియోజకవర్గాల్లో ఓట్లను తనిఖీ చేయండి. 
 
ఇంటింటి తనిఖీ అవసరం ఉంది. తెనాలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధిని అందరూ గుర్తు చేసుకుంటారు. వచ్చే జనసేన ప్రభుత్వంలో తెనాలి నుంచి గెలిస్తే నియోజకవర్గంలో అద్భుతమైన పనులు ఎలా చేస్తామో ప్రజలకు తెలియచేద్దాం. ఖచ్చితంగా అన్ని వర్గాలవారూ జనసేన వైపు చూస్తున్న సమయంలో అందరం సమష్టిగా పని చేసి, విజయతీరాల వైపు పయనిద్దాం అని పిలుపునిచ్చారు.