బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (22:52 IST)

రాజమండ్రి రూరల్ సీటుపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. మరో త్యాగం చేసిన జనసేనాని!!

Pawan Kalyan at Bhimavaram meeting
రాజమండ్రి రూరల్ సీటు కోసం జనసేన పార్టీ నేతలు గట్టిగా పట్టుబట్టారు. అయితే, ఆ టిక్కెట్‍‌ను టీడీపీ కేటాయించుకుంది. ఇక్కడ నుంచి బుచ్చయ్య చౌదరి పోటీ చేయనున్నారు. దీంతో జనసేన పార్టీ వెనక్కి తగ్గింది. ఆ స్థానానికి ప్రత్యామ్నాయంగా నిడదవోలు సీటును తీసుకుంది. ఈ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా కందుల దుర్గేశ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు కందుల దుర్గేశ్‌ను శనివారం రాత్రి కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. దీనికి కూడా దుర్గేశ్‌కు సమ్మతం తెలిపారు. ఫలితంగా బుచ్చయ్య చౌదరి రాజమండ్రి గ్రామీణ స్థానం నుంచి నిడదవోలు నుంచి కందుల దుర్గేశ్ పోటీ చేయనున్నారు. 
 
నిడదవోలు నుంచి పోటీపై కందుల దుర్గేశ్ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం కార్యకర్తలతో విస్తృత చర్చల అనంతరం అభిప్రాయం తెలియజేస్తానని పార్టీ అధ్యక్షుడికి చెప్పా. పొత్తు నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలపైనా ఒత్తిళ్లు ఉంటాయి. దీని వల్ల నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చంద్రబాబు కూడా నిడదవోలులో టీడీపీకి మంచి క్యాడర్ ఉందని అన్నారు. వారు సహకరిస్తారని తనతో చెప్పారు' అని దుర్గేశ్ పేర్కొన్నారు.
 
వైసీపీ నేతలకు తన పార్టీ అభ్యర్థుల ఎంపిక గురించి మాట్లాడే అర్హత లేదని దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలో ఏ నాయకుడిని ఎక్కడికి పంపిస్తున్నారో ముందు తెలుసుకోవాలని విమర్శలు చేశారు. జనసేన క్యాడర్ కొంత బాధతో ఉన్నమాట వాస్తవమేనని, వారందరినీ సముదాయించి పార్టీ నిర్ణయానికి కట్టుబడేలా చేస్తామని తెలిపారు. పార్టీని వీడే ఆలోచన కానీ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో కానీ లేదని స్పష్టంచేశారు.