పవన్ ముసుగూ తొలగిపోతోంది...

Last Updated: శుక్రవారం, 15 మార్చి 2019 (16:13 IST)
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల సమయం సమీపిస్తోంది. దీంతో ఒక్కో రాజకీయ నేత ముసుగూ తొలగిపోతోంది. తాజాగా భాజపాకి తాము విధేయులమనీ, ఆ పార్టీ పోటీ చేసే చోట తమ పార్టీలో బలహీనమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతామని చెప్తూ... టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్‌కి అడ్డంగా దొరికిపోయిన వైకాపా నేత ఒక ఎత్తయితే, ఈసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభిమానం ఉన్న పలువురు, అనుకోకుండానే తమ అనుబంధాన్ని బయట పెట్టేసుకుంటున్నారు.

ఇప్పటికే పరుచూరి అశోక్ బాబు, హీరో శివాజీ వంటివారు తెలుగుదేశం పంచన చేరుతూండటం తెలిసిన విషయమే. వీళ్లంతా గతంలో జగన్‌ను అధికారంలోకి రాకుండా ఏదో విధంగా తమ చేతనైన సాయం చేసిన వారే. అయితే ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరిపోతున్నట్లు కనిపిస్తోంది.

రాజమండ్రిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం ఆద్యంతం తెలుగుదేశం తరచు వినియోగించే పాయింట్లతోనే సాగింది. పైగా పొరపాటున కూడా ఆయన గతంలో లోకేష్‌పై చేసిన అవినీతి ఆరోపణలు కానీ, రాజధాని భూముల వ్యవహారం కానీ, ఇసుక తదితర అవినీతి ఆరోపణలను కానీ ప్రస్తావించలేదు. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడుకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇక తెలుగుదేశం సదా ప్రస్తావించే విషయాలను ఎలా వల్లె వేసారు అంటే.. కేసిఆర్‌కు జగన్‌కు దోస్తానా? మోడీకి జగన్‌కు దోస్తానా? ఆంధ్రుల ఆత్మగౌరవానికి కేసిఆర్‌తో ఇబ్బంది? వంటి పాయింట్ల చుట్టూ సాగడం విశేషం.

ఇప్పటికే ఎవరు సర్వే చేసినా, అది ఏ పార్టీకి అనుకూలంగా వచ్చినా, జనసేన విషయంలో మాత్రం సింగిల్ అంకె ఓట్ల శాతం మాత్రమే ఆ పార్టీకి వస్తుందని. పవన్ వాలకం చూస్తూంటే ఇవన్నీ తెలిసి కూడా ఇంకా జనసేనను జనాలకు దూరం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరి ఈ పొత్తు ఎంత దూరం వస్తుందో చూద్దాం.దీనిపై మరింత చదవండి :