మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (12:21 IST)

ధర్మవరంలో పోలీసుల అధర్మం... పవన్ కళ్యాణ్ ఫైర్

అనంతపురం జిల్లా ధర్మవరం గ్రామం ఒక పోలీస్ ఉద్యోగి అనాలోచిత, విచక్షణారహిత, పక్షపాత వ్యవహారశైలివల్ల ప్రస్తుతం అశాంతితో అల్లాడిపోతోంది. గుంటూరు జిల్లా దుర్గి మండలంలో ఉన్న ఈ గ్రామంలో చాలామంది పురుషులు పోలీస్ భయం కారణంగా గ్రామం వదిలి ఇతర ప్రాంతాలలో తలదాచుకోవలసిన దురదృష్ట పరిస్థితిని పోలీసులు సృష్టించారు.
 
శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులే అశాంతికి కారణమైతే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? గ్రామంలో ఏటా జరిగే తిరునాళ్లలో ఆనందంగా నాటికను ప్రదర్శించడమే పాపమా? ఆ నాటికలో జనసేన జెండాలు ప్రదర్శించడమే నేరమా? నాటికను మధ్యలో బలవంతంగా ఆపేసే అధికారం ఆ పోలీస్ ఉద్యోగికి ఎవరిచ్చారు? ఈ నాటిక ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది పోలీసులే.. దీనిని  ప్రశ్నించిన మహిళలను నెట్టివేయమని (మాన్ హ్యాండ్లింగ్) ఏ చట్టం చెబుతోంది? లాఠీలతో కొట్టడానికి ఆ అధికారికి ఎవరు అనుమతి ఇచ్చారు.
 
ఆడవారిపై దౌర్జన్యం చేసి గ్రామస్తులను రెచ్చగొట్టిన పోలీసుపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను జనసేన కోరుతోంది. అక్రమంగా అరెస్టుచేసిన జనసేన కార్యకర్తలు నాగేశ్వర రావు, బి.రమేష్‌లను తక్షణం విడుదల చేయాలి. మరో 32 మందిపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలి. 
 
ఎవరు రెచ్చగొట్టినప్పటికీ, మనల్ని ఎవరు దూషించినప్పటికీ శాంతియుతంగానే సమాధానం చెబుదాం. ఇటువంటి విషయాలలో జనసైనికులు సంయమనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బాధితులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.