సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 6 మార్చి 2019 (20:01 IST)

ఎక్కి తొక్కుతామంటే కిందపడేసి కొడతాం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

భార‌తీయ జ‌నతా పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నా గురించి మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ త‌గ్గాల్లో నేర్చుకుంటే మంచిది అన్నారు. చిత్తూరు నుంచి ఆయ‌న‌కు ఒక‌టే చెబుతున్నాను. ఎక్క‌డ త‌గ్గాలో తెలియ‌కుండా ఇంత దూరం రాలేదు. అవ‌స‌రం అయితే ఎక్క‌డ పెర‌గాలో కూడా తెలుసు. నా మీద‌ ఎక్కి తొక్కుతాం అంటే మాత్రం కింద‌ప‌డేసి కొడ‌తాం అంటూ జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మండిప‌డ్డారు. 
 
నా దేశ‌భ‌క్తి గురించి తెలియాలంటే మీ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీని అడ‌గండి. చ‌ట్ట‌స‌భ‌ల్లో ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేక‌పోయారు క‌నుకే భార‌తీయ జ‌న‌తా పార్టీతో విబేధించాను. ప్ర‌త్యేక ప్యాకేజీ పేరు చెప్పి స‌హ‌జంగా రావాల్సిన ఫండ్సే ఇస్తే తెలుగుదేశం పార్టీ అడ‌గ‌లేక‌పోయారు. నేను ప్రశ్నించానని కోప్పడితే ఎలా..? భార‌తీయ జ‌న‌తా పార్టీకేనా దేశ‌భ‌క్తి ఉండేది..? జ‌న‌సేన‌కు లేదా..? సిపిఐ, సిపిఎం, ఇత‌ర‌ పార్టీల‌కు లేదా..?. ఆ అధికార ప్రతినిధికి చెబుతున్నా నోరు కొంచెం నియంత్రించుకోండి. వాక్ శుద్దిని పాటించేవాడిని, మీరు యుద్ధానికి సై అంటే నేను రెండు సార్లు సై అంటాను. మీ పార్టీ నాయ‌కులంటే నాకు గౌర‌వం ఉంది కానీ నేను మీకు బానిస‌ను కాను అని చెప్పారు.
 
ఎర్ర చందనం మాఫియాలో అధికార ప్రతిపక్షాలు కుమ్మక్కు శేషాచ‌లం అడ‌వుల్లో స్మ‌గ్ల‌ర్లు ఎర్ర‌చంద‌నం అడ్డ‌గోలుగా దోచేస్తున్నారు. రాజ‌కీయనాయ‌కుల‌కు తెలియ‌కుండానే స్మ‌గ్లర్లు దోచుకుంటున్నారా..? ఎర్ర‌చంద‌నం అమ్మితే వ‌చ్చిన డ‌బ్బుతో అమ‌రావ‌తి క‌ట్టొచ్చు అన్న చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను అమ్మ‌లేక‌పోయారు. అవి పుచ్చుపోతున్నాయి. వేలంలో కొన‌టానికి వ‌చ్చినవాళ్ళను లోక‌ల్ మాఫియా బెదిరించి రేటు ప‌డిపోయేలా చేశారు. 
 
ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ లో తెలుగుదేశం, వైసీపీ నాయ‌కులు కుమ్మ‌కైపోవ‌డం వ‌ల్ల‌ ప్ర‌భుత్వ ఖ‌జానాకు రావాల్సిన డ‌బ్బులు ప్రైవేటు వ్య‌క్తుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఏడుకొండ‌లవాడి సంప‌ద‌ను దోచేస్తే ఏ ఒక్క‌డు కూడా ప్రాణాల‌తో మిగ‌ల‌రు. జ‌న‌సేన ప్ర‌భుత్వం వ‌స్తే ఒక్కొక్క స్మ‌గ్ల‌రు, వారి వెనక ఉన్న ఒక్కొక్క రాజ‌కీయ నాయ‌కుడికి తోలు తీసి కూర్చోబెడతాం . ఎర్ర‌చంద‌నం రాయ‌ల‌సీమ సంప‌ద, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల సంప‌ద దాని జోలికొస్తే కాళ్లు విర‌గ్గొడ‌తాం. శిశుపాలుడు త‌ప్పులు కృష్ణుడు లెక్క‌బెట్టిన‌ట్లు రెండు పార్టీల నాయ‌కుల త‌ప్పులు ప్ర‌జ‌లు లెక్క‌బెడుతున్నారు అని చెప్పారు.