ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2024 (19:04 IST)

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

pawan kalyan
వైకాపా నేతలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరిక చేశారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా వైకాపా నేతల తీరు ఉందని, వారికి తగిన శాస్తి చేయకతప్పదని ఆయన హెచ్చరించారు. ఎన్డీయే కూటమి నేతలను, ఆడబిడ్డలను లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే సహించే ప్రసక్తే లేదని, ఈ మాట ఒక పవన్ కళ్యాణ్‌గా చెప్పడం లేదని, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా చెబుతున్నట్టు తెలిపారు. అలాగే, పదేపదే ఓజీ.. ఓజీ అని అరిచేబదులు.. భగవంతుని నామస్మరణ చేయాలని ఆయన తన అభిమానులకు సూచించారు. సినిమా అనేది సరదా కోసమే ఉండాలని, అది జీవిత వ్యసనంగా ఉండరాదన్నారు. సినిమాలు చూడటానికైనా డబ్బులు కావాలి కదా అని ప్రశ్నించారు. 
 
ఆయన మంగళవారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ యాగశాలలో నిర్వహించిన సుదర్శన నరసింహ ఆంజనేయ సుబ్రమణ్య హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు పవన్‌కు ఆశీర్వాదం అందించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా 11 సీట్లకే పరిమితమైనా వైకాపా నాయకుల నోళ్లు ఆగడం లేదని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆడబిడ్డలను కించపరిస్తే చూస్తూ ఊరుకోబమని తేల్చి చెప్పారు. ఆడబిడ్డల భద్రత విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అలాగే, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు రక్షణ కల్పిస్తామని తెలిపారు.