సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (15:28 IST)

రెవన్యూ సిబ్బందితో టిక్కెట్లు అమ్మించారుగా... ఇపుడు పెన్షన్లు ఇప్పించలేరా? : పవన్ కళ్యాణ్

pawan kalyan
తన సినిమా "భీమ్లా నాయక్" విడుదలైతే రెవెన్యూ సిబ్బందికి డ్యూటీలు వేసి టిక్కెట్లు అమ్మించగా, ఇపుడు అదే రెవెన్యూ సిబ్బందితో పింఛన్లు ఇప్పించలేరా? అని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధించారు. ఏపీలో మంగళవారం నుంచి వృద్ధులకు, వికలాంగులకు సచివాలయాల వద్ద పింఛన్లు ఇస్తున్నారు. అయితే, గ్రామాల్లోని సచివాలయాల వద్దకు వృద్ధులను మంచాలపై తరిలిస్తున్న దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. 
 
"ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగారూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్లవద్దే పెన్షన్లు అందించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? అని సూటిగా ప్రశ్నించారు. "పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ల వద్ద రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు. తాహసీల్దారుల నంబర్లు ఇస్తారు. మరి అదే ఉద్యోగులను పెన్షన్లు ఇవ్వడానికి వినియోగించుకోలేరా? రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులే లేరా? కరోనా కాలంలో మద్యం షాపుల వద్ద ఉద్యోగులకు డ్యూటీలు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లను ఇళ్ల వద్దే ఇవ్వొచ్చు. వైకాపా నాయకులు చేసే మెలో డ్రామాలకు, బ్లేమ్ గేమ్స్‌కు ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి" అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ల వద్ద ఉద్యోగులను నియమిస్తూ వెలువడిన ఉత్తర్వుల ప్రతిని కూడా పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌కు జతచేశారు. 
 
అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్!! 
 
కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా ఇటీవల జనసేన పార్టీలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్‌ పేరును ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఆయన పార్టీలోని ముఖ్యనేతలతో అనేక దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత మండలి పేరును ఖరారు చేశారు. అలాగే, అనంతపురం జిల్లాలోని రైల్వే కోడూరు అభ్యర్థి మార్పుపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై మరో రెండు రోజుల్లో ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 
 
పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత హరిప్రసాద్ తెలిపారు. ఇదే అంశంపై పార్టీ నేతలతో చర్చిస్తూ అభిప్రాయసేకరణ చేస్తున్నారని తెలిపారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా యనమల భాస్కర రావు పేరును పవన్ ప్రకటించారనీ, అయితే, ఆయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత వ్యక్తం కాలేదని, మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేదని తెలిపారు. అందుకే అక్కడ అభ్యర్థిని మార్చాలని జనసేన నేతలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అందువల్ల రైల్వే కోడూరు అభ్యర్థిత్వంపై గురువారం సాయంత్రానికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.