సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (09:44 IST)

పిఠాపురంలో డ‌మ్మీ ఈవీఎమ్‌ల క‌ల‌కలం - భారీ మూట‌ల‌తో ప‌ట్టుబడ్డ వైసీపీ ఎన్నిక‌ల సామాగ్రిలో ఉన్న ఈవీఎమ్‌లు

dummy evm's
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నిక‌ల వేళ డ‌మ్మీ ఈవీఎమ్‌లు క‌ల‌క‌లం రేపాయి. పెద్ద ఎత్తున మూట‌ల‌తో వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చార సామాగ్రిలో క‌లిసి ఇవి ఉండ‌టంతో అధికారులు ఖంగుతిన్నారు. ప్ల‌యింగ్ స్క్వాడ్ చేసిన త‌నిఖీల్లో పిఠాపురం బైపాసు రోడ్డులో వెళుతున్న బోలేరో వాహ‌నంలో ఇవి ప‌ట్టుబ‌డ‌టంతో ఆ వాహ‌నాన్ని అధికారులు సీజ్ చేశారు. 
 
పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండ‌టంతో అంద‌రి దృష్టి పిఠాపురంపైనే ఉంది. ఇక్క‌డ వైసీపీ ప‌లు ఎత్తుగ‌డ‌లు వేస్తుంద‌న్న ప్ర‌చారం ఉంది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం రాత్రి భారీ ఎత్తున డ‌మ్మీ ఈవీఎమ్‌లు ప‌ట్టుబ‌డ‌టంతో అధికారులు సైతం ఖగుతిన్నారు. కాకినాడ నుండి పెద్ద ఎత్తున వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చార సామాగ్రిని తుని త‌ర‌లిస్తుండ‌గా పిఠాపురం బైపాసు రోడ్డు వ‌ద్ద ప్ల‌యింగ్ స్క్వాడ్ అధికారులు వీటిని ప‌ట్టుకున్నారు. 
 
భారీ మూట‌ల‌తో డ‌మ్మి ఈవీఎమ్‌లు ఉండ‌టంతో త‌నిఖీలు చేసిన అధికారులు సైతం నివ్వెర‌పోవాల్సి వ‌చ్చింది. ఇవి పూర్తిగా ఎల‌క్ట్రానిక్ విధానంలో ఉండ‌టంతో వీటిని ఎందుకు త‌ర‌లిస్తున్నార‌నే దానిపై ఆరా తీస్తున్నారు. వీటితోపాటు జ‌గ‌న్ చిత్రాలు ఉన్న మాస్క్‌లు, వైసీపీ టోపీలు, జెండాలు, కండువాలు, బొట్టు స్టిక్క‌ర్లు ఇలా భారీగా వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చార సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఎటువంటి ర‌వాణా అనుమ‌తులు లేక‌పోవ‌డంతో సీజ్ చేశామ‌ని,  జీఎస్టీ అధికారుల‌కు అప్ప‌గించి కేసు న‌మోదు చేయిస్తామ‌న్నారు. ఇదిలావుండ‌గా ఎల‌క్ట్రానిక్ విధానంలో ఉన్న ఈవీఎమ్‌ల‌పై మాత్రం అధికారులు ఎటూ తేల్చ‌లేదు. దీనిపై ఎన్నిక‌ల ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని ప్ల‌యింగ్ స్క్వాడ్ అధికారులు పైడిరాజు, ఆర్‌.వి.ప్ర‌సాద్ తెలిపారు.