శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (13:56 IST)

జగన్ రెడ్డో... ఉత్తుత్తి జగన్ రెడ్డో తేల్చండి : వైకాపా ఎమ్మెల్యేలకు పవన్ సలహా

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారు. దీన్ని వైకాపా నేతలు తప్పుబడుతున్నారు. దీనిపై పవన్ స్పందించారు. వైకాపాకు చెందిన 151 మంది ఎమ్మెల్యేలకు ఓ సలహా ఇచ్చారు. 
 
అసలు జగన్మోహన్ రెడ్డిని ఏమని పిలవాలో మీరంతా కూర్చొని ఓ తీర్మానం చేయాలని సలహా ఇచ్చారు. ముఖ్యంగా, జగన్మోహన్ రెడ్డా లేదా జగన్ రెడ్డా లేదా.. జగనా లేదా ఉత్తుత్తి జగన్ రెడ్డా వీటిలో ఏ పేరుతో పిలవాలో తీర్మానం చేసి చెప్పాలని పవన్ కోరారు. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని 'జగన్ రెడ్డి' గారు అంటే వైసీపీ నేతలు బాధపడుతున్నారని, అలా కాకుండా ఆయనను ఏమని పిలవాలనే విషయంపై ఆ పార్టీలోని 151 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఓ తీర్మానం చెయ్యాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
గుంటూరు జిల్లా మంగళగిరిలో 'డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు' పేరిట జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు ఉదయం ఉచిత అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికులకు ఇక్కడ ఉచితంగా ఆహారం అందించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు.
 
సినిమాల్లో చేసినవి నిజ జీవితంలో చెయ్యడం చాలా కష్టమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రెండున్నర గంటల సినిమాలో సమస్యలకు పరిష్కారం చూపొచ్చని, నిజ జీవితంలో మాత్రం సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
 
తాను ఏ రోజునా రాజకీయాల్లో వ్యక్తిగత గుర్తింపు కోరుకోలేదని, సామాన్యులకి అండగా నిలబడడానికే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ఐదు నెలలుగా పట్టించుకోకుండా, 50 మందిని చంపేసి ప్రభుత్వం ఇప్పుడు ఇసుక వారోత్సవాలు చేస్తోందని ఆయన విమర్శించారు.
 
ఏపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం సరిగ్గా పాలన అందిస్తే చప్పట్లు కొట్టి అభినందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ ప్రభుత్వం అలా చెయ్యని పక్షంలో తాము చాలా బలంగా పోరాటం చేస్తామని అన్నారు. గతంలో 1,400 మంది చనిపోయారని ఓదార్పు యాత్ర పేరుతో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లారని, మరిప్పుడు 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే నష్టపరిహారం ఇవ్వడానికి కూడా వైసీపీ నిరాకరిస్తోందని అన్నారు.