గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (09:40 IST)

తాను ముఖ్యమంత్రిని కావడం కాదు... జనసేన - టీడీపీ గెలవడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

pawan kalyan
తాను ముఖ్యమంత్రిని కావడం ముఖ్యం కాదని, వచ్చే ఎన్నికల్లో జనసేన - టీడీపీలు కలిసి పోటీ చేసి గెలుపొందడమే లక్ష్యమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అదేసమంలో వైకాపా నేతలు మళ్లీ అధికారం దక్కించుకునేందుకు 26 లక్షలకు పైగా దొంగ ఓట్లను సిద్ధం చేశారని, పైగా, ఆ పార్టీ రక్తం మరగి ఉందని, వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్ వేరే రకంగా ఉంటుందన్నారు. అందువల్ల ఈ దఫా జరిగే ఎన్నికలు అమీతుమీ యుద్ధమే ... మనమే గెలుస్తాం అని అన్నారు. 
 
మచిలీపట్నంలో జనసేన పార్టీ నేతల అంతర్గత సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, 2024 ఎన్నికల్లో జనసేన - టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చాక అధికారం ఎవరికి అందుతుందనే అంశంపై మాట్లాడుకుందామని చెప్పారు. జనసైనికులు పంతాలకు పోకుండా టీడీపీ శ్రేణులతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 
 
ఒక్క సామాజిక వర్గం మద్దతుతో అధికారం రాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే డ్రాకులా మాదిరిగా ప్రజల రక్తం తాగేస్తాడని హెచ్చరించారు. ఆయన వద్ద ప్రైవేట్ సైన్యం ఉందని, గతంలో బెంగుళూరులో ఎస్ఐ స్థాయి అధికారిని కొట్టి జైల్లో ఉంచిన ఘతన వారికుందన్నారు. 
 
అలాగే, అధికారం రాత్రికి రాత్రే రాదన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 20 యేళ్లు బీఎస్పీ కృషి చేస్తేనే మాయావతి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఆ పార్టీని ఆదర్శంగా తీసుకుని అన్నివర్గాలను కలుపుకుని వెళ్లి అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తానని తెలిపారు. ఆరు నెలల్లో అధికారం కోల్పోయే పార్టీని ఎందుకు తిట్టాలి.. వైకాపా నేతలు నన్ను తిట్టినా సన్నాసి అని మాత్రమే సంబోధించానని, ఇక నుంచి ఇలాంటి పదాలు కూడా ఉపయోగించనని పవన్ కళ్యాణ్ అన్నారు.