గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2023 (22:19 IST)

నా సినిమాలు ఆపితే భయపడతానని అనుకోవద్దు : గ్లాజు - సైకిల్ అందుకే కలిశాయి : పవన్ కళ్యాణ్

pawan kalyan
కృష్ణా జిల్లా అవనిగడ్డ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్ల నుంచి ముద్దులు పెడుతున్నాడు, తిరుగుతున్నాడు అని జగన్‌ను గెలిపిస్తే దెయ్యమై రాష్ట్రాన్ని పీడిస్తున్నాడని మండిపడ్డారు. తనను కాపులతో తిట్టిస్తూ జగన్ పిల్లవేషాలు వేస్తున్నాడని వ్యాఖ్యానించారు. 
 
'నన్ను ఎవరితోనైనా తిట్టించుకో... నాకేమీ కాదు. కానీ జగన్ ఇలాంటి పిల్లవేషాలు వేయడం, చచ్చు సలహాలు ఇవ్వడం ఆపి పరిణతితో ఆలోచించు' అని హితవు పలికారు. 'నేను భగత్ సింగ్ వారసుడ్ని... జగన్ లాంటి వాళ్లకు భయపడేవాడ్ని కాదు. నేను వెళ్లి నా సినిమా రిలీజ్ అవుతోంది... కాస్త టికెట్ రేట్లు పెంచండి అంటే జగన్‌కు ఆనందంగా ఉంటుంది. పవన్ కల్యాణ్ అంతటివాడే నా వద్దకు వచ్చాడని జగన్ సంబరపడతాడు. కానీ నాకు ఒక పొగరు ఉంది జగన్... నా సినిమాలు ఆపుకుంటావా ఆపుకో... భయపడతానని మాత్రం అనుకోవద్దు. నన్నేం చేయగలవ్ జగన్?' అంటూ సవాల్ విసిరారు.
 
'నేను కులాల మధ్య వైషమ్యాలు దూరం చేయడం గురించి, కులాల గురించి, వారికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడతాను. జగన్ లాగా ముఖ్యమైన పదవులన్నీ ఒకే కులానికి కట్టబెట్టే మనస్తత్వం నాది కాదు. నా ఫ్యాన్స్‌లో అన్ని కులాల వారు ఉన్నారు. అన్ని కులాల వారికి న్యాయం జరగాలని ఆలోచిస్తాను' అని పవన్ స్పష్టం చేశారు.
 
గతంలో చంద్రబాబుతో రాజధాని, ప్రత్యేక హోదా అంశాలపై విభేదించానని, ఈసారి అలాంటి విభేదాలు రావని బలంగా నమ్ముతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యేకహోదాపై ప్రధానితో విభేదించాను.. ప్రత్యేక ప్యాకేజీ ఎలా తీసుకుంటారని చంద్రబాబుతో విభేదించాను అని వివరించారు. 2024లో ఓటు చీలకూడదని, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా... అండగా నిలవండి అని కోరారు. ఏపీని పట్టిపీడిస్తున్న వైసీపీ మహమ్మారికి జనసేన - టీడీపీ కూటమి విజయమే వ్యాక్సిన్ అని పవన్ స్పష్టం చేశారు.
 
జనసేన గ్లాసు గొంతుకు దాహం తీర్చుతుందని, టీడీపీ సైకిల్ నేలను అంటిపెట్టుకుని ఉంటుందని, ఈ రెండూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాన్ని స్థాపించి... కరెంటు కోత మోగించే వైసీపీ ఫ్యాన్‌ను పీకేద్దాం అని పిలుపునిచ్చారు.
 
కాగా, అవనిగడ్డ సభకు జనసేన, టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో కదంతొక్కాయి. పవన్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు... అలాగే నారా లోకేశ్‌కు, నందమూరి బాలకృష్ణకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.