1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (17:14 IST)

ఆడపిల్లలను వేధించే పోకిరీలను చెప్పుతో కొట్టండి : పవన్ కళ్యాణ్

యువతలో ప్రశ్నించే దమ్ము తగ్గిపోవడం వల్లే సమాజంలో యువతులు, మహిళలపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 25 రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తూ రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులను నిలదీసి ప్రశ్నించే దమ్ము యువతలో తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కేవలం ఒక్క తరం చేసిన తప్పుతో రాష్ట్రం రెండు ముక్కలైందని ఆయన గుర్తు చేశారు. యువత ప్రశ్నించక పోవడంవల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందడుగు వేయాలని ఆయన కోరారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో కలసి పవన్ కల్యాణ్ 'స్వచ్ఛ భారత్'లో పాల్గొన్నారు. 
 
అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ విజయానికి అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రత ఒక్కరి వల్లనే సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆడపిల్లకు భద్రత ఉండే సమాజం కావాలన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా బయటకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఎవరైనా తప్పు చేస్తే నిలదీయగలిగే సత్తా విద్యార్థుల్లో రావాలని చెప్పారు. ఆడపిల్లలను ఏడిపించే పోకిరీలకు చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పాలన్నారు. ఎవరైనా ఏడిపిస్తే చెప్పుతో బుద్ధి చెప్పాలన్నారు. సొంత ఊరిని, కన్నతల్లిని ఎవరూ మరువకూడదన్నారు.
 
అంతేకాకుండా, సినిమాల్లో నీతి చెప్పడం చాలా తేలికని, ప్రతి ఒక్కరూ విద్యావంతులైతేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అమ్మాయిలపై దాడులను యువత తిప్పి కొట్టాలన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, సమాజసేవే ముఖ్యమన్నారు.