మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జులై 2023 (19:57 IST)

ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం : పవన్ కళ్యాణ్

pawan kalyan
వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశం మంగళవారం ఢిల్లీలో జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఆయన మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తన వెంట పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌ను కూడా తీసుకెళ్లారు. 
 
ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అవకాశం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 'రేపటి భేటీ కోసం భాజపా సీనియర్‌ నేతలు ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మార్గాలపై రేపటి భేటీలో చర్చిస్తాం. ఎన్డీయే విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తాం' అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 
 
అంతకుముందు జనసేన పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై చర్య తీసుకోవాలని ఆయన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇందుకోసం ఆయన సోమవారం తిరుపతికి వెళ్లారు. అక్కడ ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడిపై జరిగిన దాడి ఘటనను సుమోటాగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. 
 
ఇది తమ నాయకుడు కొట్టే సాయిపై జరిగిన దాడి మాత్రమే కాదని, వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలని ఆయన కోరారు. ఇవాళ సాయిపై జరిగింది. రేపు ఇంకొకరిపై జరగొచ్చు అని తెలిపారు. నిరసన తెలియజేయడం ప్రజల ప్రాథమిక హక్కు అని, దాన్ని దెబ్బతీస్తే సహించబోమని స్పష్టం చేశారు.