గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

తిరుపతిలో జనసేనాని.. సీఐ అంజూ యాదవ్‌పై చర్యకు డిమాండ్

pawankalyan
తమ పార్టీ కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇందుకోసం ఆయన సోమవారం విజయవాడ నుంచి తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు రేణిగుంట విమానాశ్రయంలో జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి 15 కిలోమీటర్ల మేరకు జనసేనాని ర్యాలీగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూ యాదవ్‌ చేతిలో దెబ్బలు తిన్న కొట్టే సాయితో పాటు మరో ఆరుగురితో కలిసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. 
 
కాగా, ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆ సమయంలో సీఐ అంజూ యాదవ్ జనసైనికులపై విరుచుకుపడ్డారు. నిరసనకారులను అదుపుచేసే క్రమంలో జనసేన లీడర్ కొట్టే సాయిపై ఆమె చేయిచేసుకున్నారు. ఇతర కార్యకర్తలు, అభిమానులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించి, ఆమెపై ఏకంగా తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. సీఐ అంజూ యాదవ్‌కు ఛార్జ్ మెమో జారీ చేసినట్టు సమాచారం. అలాగే, జిల్లా ఎస్పీ ఇప్పటికే విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.