డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో భేటీకానున్న జనసేన పార్టీ చీఫ్ పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలను ఇష్టానుసారంగా వేధిస్తున్నారు. పోలీసులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని, కీలుబొమ్మలుగా చేసి కేసులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా, తమకు ప్రధాన శత్రువులుగా భావిస్తున్న టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలపై లెక్కకు మించి కేసులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీకానున్నారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం అపాయింట్మెంట్ కోసం డీజీపీ కార్యాలయానికి లేఖ రాసింది.
డీజీపీ సమయాన్ని కేటాయించగానే ఆయనతో పవన్ కళ్యాణ్, పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ భేటీకానున్నారు. ఇందులో తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న తీరును లిఖితపూర్వకంగా వివరించనున్నారు.