గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (08:41 IST)

జగన్ సర్కారు బాదుడే బాదుడు... సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే రూ.10 వేల ఫైన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం మరోమారు బాదుడు మొదలుపెట్టింది. కొత్త మోటార్ వాహన చట్టం పేరుతో వాహనచోదకుల నుంచి భారీ మొత్తంలో అపరాధ రుసుం వసూలు చేయనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు జీవో విడుదల చేశారు. 
 
కొత్త మోటార్ చట్టం కింద ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ మొత్తంలో అపరాధం వసూలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ద్విచక్రవాహనం నుంచి 7 సీట్ల కార్ల వరకు ఒకే విధమైన జరిమానాను విధించడం గమనార్హం. ఇక లారీలు తదితర ఇతర వాహనాలకు అయితే ఇంకా భారీ జరిమానాలు విధించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. 
 
ఏపీ సర్కారు జారీచేసిన కొత్త ఉత్తర్వుల మేరకు.. కొత్తగా వసూలు చేయనున్న అపరాధ రుసుం వివరాలను పరిశీలిస్తే, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు రూ.10,000, పర్మిట్ లేని వాహనాలు వాడితే రూ.10,000, బండిని వేగంగా నడిపితే రూ.1000, ర్యాష్ డ్రైవింగ్‌కు తొలిసారి రూ.5,000, రెండోసారి రూ.10,000 జరిమానా విధిస్తారు. 
 
అలాగే, రిజిస్ట్రేషన్ లేకున్నా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా మొదటిసారి రూ.2,000 రెండో సారి రూ.5,000 చెల్లించుకోవాల్సి వుంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10,000, లైసెన్స్ లేకుండా వాహనం నడిపిస్తే రూ.5 వేల జరిమానా పడుతుంది. 
 
వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే రూ.750, సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే రూ.750, ఓవర్ లోడుతో వాహనం నడిపిస్తే రూ.20 వేలు, ఆపై టన్ను అదనపు బరువుకు రూ.2 వేలు జరిమానా పడుతుంది. పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టుగా తేలితే, సదరు వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. 
 
అదేవిధంగా ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10,000, అనవసరంగా హార్ మోగిస్తే తొలిసారి వెయ్యి, రెండోసారి రెండు వేలు, వాహన నిబంధనలకు వ్యతిరేకంగా మార్పులు చేసే సంస్థలు, డీలర్లకు రూ.లక్ష జరిమానా వసూలు చేసేలా ఉత్తర్వులు జారీచేసింది.