బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (08:22 IST)

నెలాఖరు వరకూ ప్రజలు ఇళ్ళకే పరిమితం: నీలం సాహ్ని

కరోనా వైరస్ పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తదితర అధికారులతో విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీడియో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో సిఎస్ మాట్లాడుతూ ఈనెలాఖరు వరకూ ప్రజలు ఇళ్ళ లోనే ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మూడు అడుగుల దూరాన్ని పాటించాలని సూచించారు.

అత్యవసర సేవలు అందించే వారు మినహా ఎవరూ ఇళ్ళ నుండి బయిటకు రావద్దని చెప్పారు. వారం రోజుల పాటు రాష్ట్ర మంతటా ప్రజా రవాణా వ్యవస్థ రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ఈనెలాఖరు వరకూ ప్రజలు ఇళ్ళకే పరిమితం చేయడంలో ప్రజలను ఒప్పించడంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాలో తగిన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని అత్యవసేతర ఎస్టాబ్లిష్మెంట్స్ తక్కువ సిబ్బందితో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకలతో కూడిన క్వారంటైన్ సౌకర్యాల కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకలతో టెర్ష త్రీ కేర్ సర్వీసులకు ఏర్పాటు చేయాలని సిఎస్ నీలం సాహ్ని కలెక్టర్లును ఆదేశించారు.

అంతేగాక విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా హొమ్ ఐసోలేషన్,క్వారంటైన్ కేంద్రాలలో ఉండేలా చూసుకోవాలి చెప్పారు. ఐసోలేషన్ లో పెట్టే వారందరికీ ప్రత్యేక రూమ్లు, మరుగుదొడ్లు ఉండేలా చూసుకోవాలి చెప్పారు. ఈనెల 31వ తేది అర్ధరాత్రి వరకూ రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్,ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు అన్నీ మూసివేయాలని ఇప్పుటికే చర్యలు తీసుకున్నందున ఆ ఆదేశాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు.

కవిద్-19 నివారణకు క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ ఇతర ఖర్చులు నిమిత్తం జిల్లాకు 50లక్షల రూ.లు వంతున విడుదల చేశామని తెలిపారు. వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా‌.కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 31 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ధియేటర్లు, దేవాలయాలు,చర్చిలు,మసీదులు, షాపింగ్ మాల్స్,క్రీడా స్టేడియంలు, కల్చరల్ ఈవెంట్స్ వంటి కార్యకలాపాలు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినందున ప్రజలెవరూ ఇళ్ళ నుండి బయిటకు రావద్దని సూచించారు.

కేవలం అత్యవసర సేవలు అందించే వైద్య డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్,మీడియా తదితరులు మినహా మిగిలిన ఎవ్వరూ బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.రానున్న రెండు వారాలు అత్యంత కీలకం కావున ప్రజలు అన్నివిధాలా సహకరించాలని కోరారు.అదేవిధంగా ఎవరైనా క్వారంటైన్ కేంద్రాల నుండి బయిటకు వెళ్ళిపోతే అలాంటి వారిని పట్టుకుని క్వారంటైన్ కేంద్రాలలో ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ప్రభుత్వం జారీ చేసిన వివిధ ఆదేశాలను సక్రమంగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు.ప్రజారవాణా వ్యవస్థను,ప్రవేట్ రవాణాను పూర్తిగా రద్దు చేసినందున ప్రజలు స్వంత వాహనాలలో కూడా ప్రయాణించడం విరమించుకోవాలని స్పష్టం చేశారు.

వీడియో సమావేశంలో రెవెన్యూ,టిఆర్అండ్బి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు వి.ఉషారాణి,టి.కృష్ణబాబు,గోపాల కృష్ణ ద్వివేది, మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఆశాఖ కమిషనర్ జిఎస్ఆర్కె విజయకుమార్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ విజయరామరాజు,కార్తికేయ మిశ్రా, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న,సమాచార శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.