పెథాయ్ ఇలా టార్గెట్ పెట్టింది... ఎటు పోతుందో?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర ప్రాంతం వైపు పెథాయ్ తుఫాను దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెనుముప్పు పొంచివుంది. తిత్లీ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రం ఇపుడిపుడే కోలుకుంటోంది. ఇపుడు మళ్లీ పెథాయ్ తుఫాను దూసుకొస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి తీరం దాటనుంది. దీనికి పెథాయ్ తుఫానుగా నామకరణం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను మచిలీపట్నం కేంద్రానికి సుమారు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో ఏ ప్రాంతంలో తీరం దాటినా దాని ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండే అవకాశం ఉంది.
దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పొంచి ఉన్న ప్రకృతి విపత్తును ఎదుర్కొని ప్రాణ నష్టం లేకుండా సమర్థంగా ఏర్పాట్లు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. పెథాయ్ తుఫాను పెను తుఫానుగా మారితే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
17వ తేదీ సాయంత్రానికి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తుఫాను దిశ మార్చకుంటే దక్షిణ కోస్తా వైపు అంటే మచిలీపట్నం నుంచి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముందని వారు తెలిపారు.