మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (15:25 IST)

భయపెడుతున్న పెథాయ్ : ఆంధ్రప్రదేశ్‌ అప్రమత్తం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడివున్న వాయుగుండం ఇపుడు తుఫానుగా మారింది. ఈ తుఫానుకు పెథాయ్ అనే పేరు పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భయపెడుతోంది. దీంతో రాష్ట్ర యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేశారు. 
 
శుక్రవారం కేంద్ర వాతావరణ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశలో 1030 కిలోమీటర్లు, చెన్నైకు 930 కిలోమీటర్ల దూరంలో పెథాయ్ కేంద్రీకృతమైవుంది. 
 
ఇది వచ్చే 12 గంటల్లో మరింతగా బలపడి తుఫాన్‌గా మారుతుందని, 36 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని తెలిపింది. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పెథాయ్ తీరం వైపు దూసుకొస్తున్నట్టు తెలిపింది. 
 
తుఫాన్ ప్రభావంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కోస్తాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తీరం వెంబడి పెను గాలులు వీయడంతోపాటు సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని తెలిపింది. తీరందాటే సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయిని, అందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తెలిపింది. 
 
అదేసమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం మార్పులను అమరావతిలోని ఆర్టీజీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో రేపటి నుంచి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. ఈ నెల 16, 17 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.