మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (14:46 IST)

9న తిరుమలకు ప్రధాని మోడీ : నవ్యాంధ్రలో సీబీఐ ఎంట్రీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల్లో గెలిచినందుకుగాను ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు సన్నద్ధమవుతున్నారు.
 
ఇదిలావుంటే, ఏపీలో సీబీఐ అనుమతికి వైకాపా సర్కారు అనుమతి ఇవ్వనున్నారు. సీబీఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉన్న స్వతంత్ర దర్యాప్తు సంస్థ. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అయితే, ఇందుకు ఆయా రాష్ట్రాలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది 
 
కానీ, సీబీఐని కేంద్రం రాజకీయ వేధింపులకు ఓ ఆయుధంగా వాడుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. అభియోగాలు, కుమ్ములాటల నేపథ్యంలోనే సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను రద్దు చేశామని అప్పటి ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పుకొచ్చారు. తాజాగా ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆ చట్టాన్ని సవరించి, ఏపీలో సీబీఐ ఎంట్రీకి అనుమతి ఇవ్వనుంది.