జగన్ ఎందుకలా మాట్లాడారు..? మోదీ బలం చూసి ఆందోళనతో అలా..?
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి… ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మున్ముందు తను చేపట్టబోయే చర్యలు, అనుసరించే విధానాల గురించి విపులంగా మాట్లాడుతారని రాష్ట్ర ప్రజలు… ఇతర రాజకీయ పార్టీలు ఆశించాయి. అందరి ఆశలు నీరుగారిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కొనసాగింది. అయితే గతవారం రోజులుగా అధికార వర్గాలు నుండే కాకుండా వైసిపి వర్గాల నుండి ఏవేవో కథనాలు ప్రచారం లోనికి వచ్చాయి. ఎన్నికల ముందు నవరత్నాలు పేర జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలపై మంచి ప్రభావం కల్పించింది.
అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఖజానా ఖాళీ కావడంతో ఇవి ఏలా అమలు చేస్తారో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం ప్రకటన చేస్తారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కానీ వాస్తవంలో అందుకు భిన్నంగా జరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పింఛన్లు పెంచడం వరకే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు.
అంతేకాదు. రాజధాని నిర్మాణం గురించి తన విధానం ఏమిటో వివరిస్తారని రాజధాని గ్రామాల రైతులే కాకుండా రాష్ట్ర ప్రజలు ఎదురుచూచారు. దీనికితోడు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని భూముల విషయంలో కుంభకోణం జరిగిందని సిట్టింగ్ జడ్జీ చేత విచారణ చేయిస్తానని చేసిన ప్రకటన కూడా మరింత ఆసక్తిని పెంచింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తదుపరి ఏవిధమైన ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. ఈ అంశంపై భిన్న కథనాలు ప్రచారంలోనికి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ఆ ఊసే ఎత్త లేదు. ఎందుకిలా జరిగిందో అర్థం కాకుండా వైసిపి వర్గాలు కూడా విస్తుపోయాయి. జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలో తీసుకునే చర్యలతో టిడిపి ఖతం అవుతుందని వైసిపి శ్రేణులు ఆశించగా వాస్తవంలో నిరాశకు గురైనవి.
మరో అంశం పోలవరం ప్రాజెక్టు…. ఇది రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ అంశం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బాధ్యులు పోలవరం భవిష్యత్తుపై చేసిన ప్రకటనలు నిజంగానే భయాందోళనలు కలిగించాయి. కాపర్ డామ్ పనులు నిలిపివేయాలని ప్రతిపాదన జరిగితే వచ్చే ఏటికి గ్రావెటీ ద్వారా నీళ్లు ఇవ్వడం మరచి పోవలసినదే. అంతేకాకుండా గత వారం రోజులుగా వస్తున్న పుకార్లు మరింత ఆందోళన కలిగించాయి. పోలవరం నిర్మాణ బాధ్యత జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి అప్పజెబుతారని ప్రచారంలోనికి వచ్చింది.
ఇవన్నీ అటుంచితే నిన్నమొన్నటి వరకు చంద్రబాబు నాయుడు కాపర్ డామ్‌తోనే సరిపెట్టి, ప్రధాన డామ్ పనులు ముట్టుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అయితే తను అధికారం చేపడుతున్నందున ఏవిధమైన విధానం చేపడతారో తెలుసుకొనేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూచారు. కానీ పోలవరం అంశంతో పాటు కీలకమైన రాజధాని విషయం కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో చూచాయగా కూడా ప్రస్తావించపోవడం ఉద్దేశ పూర్వకంగా జరింగిందా? లేక ఏదైనా వ్యూహంలో భాగంగా వ్యవహరించారా అన్నది అంతు పట్టడంలేదు.
మరో విశేషం ఏమిటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలకు, ముఖ్యమంత్రిగా చేసిన ప్రసంగానికి పొంతన లేదు. ముఖ్యమంత్రిగా చేసిన ప్రసంగం చప్పగా సాగింది. సభికులను ఆకట్టుకొనే విధంగా లేదు. ఇదివరలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు సభికులను ఉర్రూతలూగించే విధంగా వుండేటివి. ఎందుకో గాని ప్రసంగం చప్పగా సాగింది. సభికుల నుండి మంచి స్పందన లేదు. గత వారం రోజులుగా జరిగిన ప్రచారం మనసులో పెట్టుకుని వచ్చినవారిని దీటుగా మెప్పించలేక పోయారు.
కేంద్రంలో మోదీ సర్కారుకి పూర్తి సంఖ్యాబలం వుండటంతో ఇక ఏపీకి ఎంతమాత్రం నిధులు వస్తాయన్న ఆందోళనలో ముఖ్యమంత్రి జగన్ మునిగిపోయారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కేంద్రం నుంచి ఏపీ అభివృద్ధికి కావాల్సిన నిధుల సమీకరణ సీఎం జగన్ ఎలా చేస్తారన్నది చూడాల్సి వుంది.