మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 30 మే 2019 (07:20 IST)

జగన్ అనే నేను... పట్టాభిషేకానికి సర్వం సిద్ధం

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహనరెడ్డి పట్టాభిషేకానికి సర్వం సిద్ధమయింది. నవ్యాంధ్ర పాలకుడి ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబయింది. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు వైఎస్‌ జగన్మోహన రెడ్డితో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ ఈఎ్‌సఎల్‌ నరసింహన్‌ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, సీపీఐ, సీపీఎం జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు హాజరవుతున్నారు.
 
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 12.23 నిమిషాలకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన నవరత్నాల హామీలపై తొలి సంతకం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, తన మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన దృష్టిసారించారు. ఇదే విషయంపై గవర్నర్ నరసింహన్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అలాగే, ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు కూడా ఆయన సిద్ధమైపోయారు. 
 
ఇందులోభాగంగా, గవర్నర్ నరసింహన్‌తో బుధవారం సాయంత్రం విజయవాడ గేట్ వే హోటల్‌లో జగన్ భేటీ అయ్యారు. గురువారం ప్రమాణస్వీకారోత్సవం కోసం విజయవాడ వచ్చిన గవర్నర్‌తో జగన్ అనేక విషయాలు చర్చించారు. ప్రమాణస్వీకార కార్యక్రమ ఏర్పాట్ల తీరుతెన్నులపైనేకాకుండా, మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, శాసనసభ్యుల ప్రమాణస్వీకారం తదితర అంశాలపై మాట్లాడారు.