గన్నవరంలో 114 సెక్షన్ - ఠాణాలో టీడీపీ నేత పట్టాభి
ఏపీలోని గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. అదేసమయంలో సోమవారం అదుపులోకి తీసుకున్న టీడీపీ సీనియర్ నేత పట్టాభిని పోలీసులు మంగళవారం గన్నవరం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు.
టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి టీడీపీ నేత పట్టాభిపైనే గన్నవరం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ క్రమంలో మంగళవారం గుర్తు తెలియని ప్రదేశానికి పట్టాభిని తీసుకెళ్ళగా, ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో పోలీసులు పట్టాభిని మంగళవారం మధ్యాహ్నం గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పీఎస్‌లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ఒకవేళ కోర్టు సమయం ముగిసిపోతే న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు.
కాగా, గన్నవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొంటూ ఆయనపై పలువురు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టు తర్వాత వాహనంలో మరో ప్రాంతానికి తరలించారు. ఓ దశలో వీరపల్లికి తరలిస్తున్నారని, హనుమాన్ జంక్షన్‌కు తరలిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఇంకోవైపు తన భర్త ఆచూకీ తెలియడం లేదంటూ పట్టాభి భార్య చందన మీడియా ముందుకు వచ్చారు. దీంతో పట్టాభిని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.