వీడు మనిషేనా..? ప్రియురాలిపై దాడి.. అపస్మారక స్థితిలో..ఎక్కడ?
మహిళలపై అకృత్యాలు పెరుగుతూనే వున్నాయి. అత్యాచారాలు, అకృత్యాల ఆగడాలు ఆగట్లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మధ్యప్రదేశ్‌లో ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడి చేసి రోడ్డుపై అపస్మారక స్థితిలోకి వదిలి వెళ్లిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఓ యువకుడు, అతని ప్రియురాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన యువకుడు ఒక్కసారిగా ప్రియురాలిని కొట్టడం ప్రారంభించాడు. ఆమెను కిందకు తోసి ఆమె ముఖంపై ఆవేశంగా కాలితో తొక్కాడు. దీంతో ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ యువకుడు ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు.
ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియురాలిపై దాడికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం యువకుడు యువతిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.