1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2023 (16:58 IST)

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : చంద్రబాబు ఇంటికి ప్రశాంత్ కిషోర్

prashanth kishore
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. శనివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిశారు. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పైగా, గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ స్వయంగా వెంటబెట్టుకుని ప్రశాంత్ కిషోర్‌ను తన వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. 
 
గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచనతో వైకాపా ఏకంగా 151 సీట్లలో విజయభేరీ మోగించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితమైన విషయం తెల్సిందే. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేకపోయాయి. ఆ తర్వాత జగన్, కిషోర్ మధ్య దూరం పెరగింది. దీంతో జగన్ - ప్రశాంత్ కిషోర్‌ల మధ్య ఎలాంటి మాటలు లేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇపుడు చంద్రబాబు ఇంటికి ప్రశాంత్ కిషోర్ రావడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
జగన్ మాదిరి బుగ్గలు నిమిరే యాత్ర : పవన్ కళ్యాణ్ 
 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర చేపట్టిన యాత్ర వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా బుగ్గలుగా నిమిరే యాత్రకాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లి పోలిపల్లిలో 'యువగళం-నవశకం' సభలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు. 'యువగళం పాదయాత్ర.. జగన్‌ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదు. ప్రజల బాధలు తెలుసుకున్న పాదయాత్ర. ఇలాంటి పాదయాత్రల వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవచ్చు. నాకు రాని అవకాశాన్ని లోకేశ్‌ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ స్ఫూర్తి భారత దేశానికి చాలా కీలకం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే. 
 
భారతదేశానికే స్ఫూర్తినిచ్చిన నేల ఇది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు గతంలో ఏపీకి రావాలని ఉవ్విళ్లూరేవాళ్లు. ఏపీ ఒక మోడల్‌ స్టేట్‌ అని అక్కడికి వెళ్లాలని చెప్పేవారు. కానీ, ఇప్పుడు.. ఏపీకి ఎందుకు వెళ్లకూడదో చెబుతున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ కలిగింది. ఏదో ఆశించి చంద్రబాబుకు మద్దతివ్వలేదు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నావంతు సాయంగా ఉండాలనే మద్దతిచ్చా.
 
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ పక్షానికి కీలక బాధ్యతలు వహించిన వ్యక్తిని జైల్లో పెట్టడం చాలా బాధ కలిగించింది. జగన్‌ చేసిన తప్పులకు సోనియాగాంధీ.. అతన్ని జైల్లో పెట్టించారు. ఆ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టించడం దారుణం. మనకు రాజధాని లేకుండా, సరైన పంపకాల్లేకుండా విభజన జరిగిన కష్ట సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా తెదేపాకు మద్దతిచ్చా. 
 
2024లో టీడీపీ - జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మార్పు తీసుకొస్తున్నాం.. జగన్‌ను ఇంటికి పంపించేస్తున్నాం. జగన్‌ 80 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారని వింటున్నాం. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్‌ను. ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్‌కు విలువ తెలియదు. ఏదైనా మాట్లాడితే దూషిస్తారు.. దాడులు చేస్తారు. మహిళను కించపర్చే సంస్కృతికి వైకాపా శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని సీఎం జగన్‌.. మహిళలకు ఏం విలువ ఇస్తారు. ఒంటరి మహిళలు అన్యాయాలకు గురవుతున్నారన్నారు. 
 
మరోసారి వైకాపా ప్రభుత్వం వస్తే నాతో సహా అంతా.. వైకాపా గూండాలను ఎదుర్కోవటానికి కర్రో, కత్తో పట్టుకోవాల్సి వస్తుందని కేంద్రంలోని పెద్దలకు చెప్పాను. తెదేపాతో పొత్తు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వివరించా. కేంద్రంలోని భాజపా పెద్దల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా. పొత్తు సాధ్యమైనంత ఎక్కువకాలం.. ఆంధ్రప్రదేశ్‌ నిలదొక్కుకునే వరకు ఉండాలి. భవిష్యత్తులో తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం. తెలుగుదేశం-జనసేన మైత్రి.. స్ఫూర్తిని చాలా సంవత్సరాలు కాపాడుకోవాలని ఆశిస్తున్నా అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.