శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మే 2024 (11:39 IST)

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిక్సర్ కొడుతున్నారని జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. జూన్ 4వ తేదీన వెలువడే ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని అన్నారు.
 
పదేళ్లుగా తాను ఎన్నికల క్షేత్రంలో ఉన్నానని, కానీ ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారిని తాను ఇంతవరకూ చూడలేదన్నారు. ఓట్ల లెక్కింపు రోజు నాలుగు రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా మున్ముందు రౌండ్లలో తమకు మెజార్టీ వస్తుందని, ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారని అన్నారు. 
 
చంద్రబాబు గెలుస్తామని చెబితే.. గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్ అంటున్నారని, ఈ చర్చకు అంతమే ఉండదని ప్రశాంత కిశోర్ వ్యాఖ్యానించారు. ఇక బీజేపీకి లోగడ కంటే సీట్లు తగ్గవన్నారు. బీజేపీ, నరేంద్రలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా ఆగ్రహం లేదని చెప్పారు. కాబట్టి ఈసారి బీజేపీకి 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ, లేదంటే అంతకంటే ఎక్కువగానీ సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.