మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2022 (12:56 IST)

ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో ఆమె రాష్ట్ర పర్యటనకు తొలిసారి రానున్నారు. తొలుత విజయవాడ నగరంలో జరిగే ఓ సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ఆ తర్వాత వైజాగ్‌లో జరిగే నేవీ డే వేడుకలతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. 
 
రాష్ట్రపతిగా నియమితులైన తర్వాత ఆమె ఏపీకి రావడం ఇదే తొలిసారి కావడం. దీంతో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 10.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఆమె విజయవాడకు చేరుకుంటారు. అక్కడ నుంచి రాజ్‌భవన్‌‍కు చేరుకుని ఆ తర్వాత నగర శివారు ప్రాంతమైన పోరంకి గ్రామంలో ఆమె గౌరవార్థం జరిగే పౌర సత్కార కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
ఆ తర్వాత ఏపీ గవర్నర్ హరిచందన్ ఇచ్చే ఆతిథ్యంలో మధ్యాహ్న భోజనం ఆరగిస్తారు. అక్కడ నుంచి ఆమె విశాఖకు బయలుదేరి వెళతారు. వైజాగ్‌ నగరంలో ఆర్కే బీచ్‌లో జరిగే నేవీ వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అక్కడ భారత నౌకాదళం యొక్క కార్యాచరణ ప్రదర్శనను వీక్షించడంతో పాటు రక్షణ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 
 
కర్నూలు జిల్లాలో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్, కృష్ణా జిల్లా నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్‌డ్ నైట్ విజన్  ప్రాడక్ట్స్ ఫ్యాక్టరీని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. కర్నూలు సత్యసాయి జిల్లాలో పలు జాతీయ రహదారుల నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేస్తారు. 
 
అలాగే, వైజాక్ అనంతగిరిలో జరిగే నేవీ డే రిసెప్షన్‌లో రాష్ట్రపతి పాల్గొనే ఆ తర్వాత తిరుపతికి బయలుదేరి వెళతారు. సోమవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని అదే రోజు ఉదయం 10.40 గంటలకు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థులు, అధ్యాపకులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఆమె ముచ్చటిస్తారు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళతారు.