మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (12:47 IST)

జిల్లా జైలులో ఖైదీ నంబర్ 8775గా అచ్చెన్నాయుడు...

తన సొంత గ్రామ నిమ్మాడలో జరిగిన ఎన్నికల ఘర్షణ కేసులో తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అచ్చెన్నాయుడుని శ్రీకాకుళం జిల్లా అంపోలులోని జిల్లా జైలుకు తరలించగా, అక్కడ ఆయనకు 8775 అనే నంబరును కేటాయించారు. దీంతో అచ్చెన్నాయుడు ఖైదీ నంబర్ 8775గా మారిపోయాడు.
 
కాగా, పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామంలో కింజారపు అప్పన్నపై నామినేషన్ల సమయంలో దాడి జరిగింది. ఈ కేసులో పోలీసులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్ నిమిత్తం గార మండలం, అంపోలులోని జిల్లా జైలుకు ఆయన్ను తరలించారు. 
 
జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 8775ను కేటాయించారు. మంగళవారం సాయంత్రం తర్వాత జైలుకు చేరుకున్న ఆయన, ఆ రోజున మూడు చపాతీలు, చిక్కుడు కాయల కూర తిని, రాత్రి 9.30 గంటలకు నిద్రపోయారని జైలు అధికారులు తెలిపారు. 
 
కాగా, బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో నిద్రలేచి, టీ తాగారని, జైలు సిబ్బంది తెచ్చిన దినపత్రికలు చదివి, ఉదయం అల్పాహారంగా పొంగలి తిన్నారని అన్నారు. 
 
తాను ఎవరినీ కలవబోనని జైలు సిబ్బందికి అచ్చెన్నాయుడు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే, నేడు లేదా రేపు లోకేశ్ సహా మరికొందరు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడిని కలవవచ్చని పోలీసులకు సమాచారం అందింది.