నివాసాల నుంచే నిరసన... అమరావతిలో ఆగని పోరు
కరోనా భయం కూడా అమరావతి రైతుల్ని కదల్చలేకపోతోంది. చేపట్టిన దీక్షనుంచి మరల్చలేకపోతోంది. మరణ భయం కూడా వారిని నీరుగార్చలేకపోయింది. కరోనా వైరస్ ప్రభావం రాజధాని ఆందోళనలను కదలబార్చలేక పోయింది. సామాజిక దూరం పాటించాలని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రైతులు, మహిళలు తమ నివాసాలనే నిరసన శిబిరాలుగా మార్చుకుని రాజధాని పోరును కొనసాగించారు.
ఇంటి ఆవరణలలోనే దూరం దూరంగా కూర్చుని, ముఖానికి మాస్కులు కట్టుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు, ఆందోళనలు శనివారానికి 102వ రోజుకు చేరాయి. రాజధాని గ్రామాల్లో వాడవాడలోనూ నిరసనలు కొనసాగాయి.
ఇళ్ల ముందున్న అరుగులపై కూర్చొని కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, శుక్రవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగడంతో సీఎం జగన్మోహనరెడ్డితో పాటు, ఇతర మంత్రులు వస్తున్నారంటూ మందడం గ్రామంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
దీక్షా శిబిరంలో రైతులు లేకపోయినా భారీగా పోలీసులను మోహరించారు. సమావేశం అయిపోయి తిరిగి సీఎం, మంత్రులు వెళ్లేదాక గ్రామంలో ఆంక్షలు కొనసాగించారు. అయితే పోలీసులు మాస్కులు లేకుండా గుంపులు, గుంపులుగా తిరగటాన్ని రైతులు ప్రశ్నించారు.