స్వాతంత్య్ర స్ఫూర్తిని భావితరాలను అందించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు కావస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ మహోత్సవం, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో శనివారం విజయనగరం పట్టణంలో ఘనంగా జరిగింది.
ముందుగా స్థానిక మూడులాంతర్లు జంక్షన్ నుంచి ఆనందగజపతి ఆడిటోరియం వరకూ ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 150 అడుగుల భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన చేశారు. ర్యాలీలో చేసిన దేశభక్తి నినాదాలతో పట్టణం మారుమ్రోగింది. ఆనందగజపతి ఆడిటోరియంలో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన అమృతోత్సవ సభకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె అధ్యక్షోపన్యాసం చేస్తూ, స్వాతంత్య్ర స్ఫూర్తిని పునఃశ్చరణ చేసుకొని, దేశప్రజలు పునరంకితం అయ్యేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని అన్నారు. అప్పటి తరం స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారితో పోరాడారని, నేటి తరం తమలో తాము అంతర్యుద్దం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.
మనలో మనకి ఉన్న విబేధాలు, అహంకారాన్ని ప్రక్కనపెట్టి, అంతా కలిసి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. కులమత, ఆడ, మగా అన్న తేడాలు లేకుండా, మనమంతా భారతీయులమన్న భావన ప్రతీఒక్కరిలో బలపడాలని, అప్పుడే దేశం అభివృద్ది పథాన ముందుకు వెళ్తుందన్నారు. భారతీయత ఒక ఆభరణమని, మన భారతీయ సంప్రదాయం మహోన్నతమైనదని, దానిని ప్రతీఒక్కరూ గౌరవించాలని కోరారు.
స్వేచ్ఛ, స్వాతంత్య్ర ఫలాలను నేటి తరానికి అందించాలని సూచించారు. సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజాలు కావని, అందువల్ల యువతరం స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ పాటించాలని, గురజాడ స్ఫూర్తితో పొరుగువాడికి సాయపడే తత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, అజాదీ కా అమృతోత్సవం ప్రతీభారతీయుడు గర్వంగా జరుపుకొనే కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ ఉత్సవాల స్ఫూర్తితో దేశాభివృద్దిలో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నేటి యువతపైనే మన దేశ పునాదులు ఆధారపడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
బాధ్యాతాయుతంగా మెలగడం ద్వారా, ఆదర్శవంతమైన సమాజాన్ని సృష్టించుకోవచ్చునని, తద్వారా గణనీయమైన పురోభివృద్దిని సాధించవచ్చని సూచించారు. నాటి నుంచి నేటి వరకూ, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ, సంక్షేమ, అభివృద్ది ఫలాలను రాష్ట్రప్రజలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని కోలగట్ల కొనియాడారు.
ఉపాధ్యాయ ఎంఎల్‌సి పాలకపాటి రఘువర్మ మాట్లాడుతూ, మన దేశంలో పాటించే విలువలు, స్త్రీశక్తికి ఇచ్చే గౌరవం, మనకు ఎంతో గర్వకారణమన్నారు. విభిన్న సంస్కృతులు, కులాలు, మతాలు, ప్రాంతాలతో అలరారే భారతదేశం ఒక చిన్న ప్రపంచం లాంటిదని పేర్కొన్నారు.
75 ఏళ్ల క్రితం మన పెద్దలు స్వాతంత్య్రం అనే మహా వృక్షాన్ని నాటారని, వాటి ఫలాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని అన్నారు. స్వావలంబన, క్రమశిక్షణ, పరస్పర తోడ్పాటు ద్వారా మనం అభివృద్దిని సాధించవచ్చని సూచించారు.
నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ, స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించడానికే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. రోటరీక్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటేశ్వర్రావు, కాపుగంటి ప్రకాష్ తదితర ప్రముఖులు మాట్లాడారు.
కార్యక్రమంలో డిప్యుటీ మేయర్ ఇసరపు రేవతీదేవి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, ఎన్‌వైకె యూత్ కో-ఆర్డినేటర్ విక్రమాధిత్య, సెట్విజ్ సిఇఓ వి.విజయకుమార్, డిఆర్‌డిఏ పిడి అశోక్, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, డిపిఓ సుభాషిణి, మెప్మా పిడి సుధాకరరావు, డిఎస్‌డిఓ వెంకటేశ్వర్రావు, ఇతర అధికారులు, పలువురు కార్పొరేటర్లు, ఎన్‌సిసి కేడెట్స్, రోటరీ ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.