1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (10:31 IST)

కపిల తీర్థం నుంచి రామ తీర్థం వరకూ రథయాత్ర, ఎవరు?

ఇరవై నెలలకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయని ఏపీ బీజేపీ ఆరోపించింది. ఈ దాడుల వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతు ఉందంటూ ఆరోపించింది. తీవ్రమైన ప్రజాగ్రహం వెల్లువెత్తిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితులలో దేవాలయాల దాడులకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. అయితే ఇది ఒక కంటితుడుపు చర్య లాగా కనబడుతోంది.
 
దేవాలయాలపై దాడులు పునరావృతం కావడం అనేది, హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి, వారిని అవమానించడానికి, వారు తమ రక్షణ విషయంలో భయపడేలా చేసి, మతమార్పిడికి అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి క్రిస్టియన్ మిషనరీలు చేస్తున్న కుట్ర అని హిందూ నేతలు నమ్ముతున్నారు.
 
రామ తీర్థంలో రాముని విగ్రహం యొక్క తలను వేరు చేసిన సంఘటన తర్వాత, పాలక వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపి నేతలను ఆ ఆలయం సందర్శించడానికి అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం, బిజెపి నేతలను, కార్యకర్తలను మాత్రం ఆలయానికి వెళ్ళకుండా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసింది.
 
ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వం టీడీపీతో చేతులు కలిపి బిజెపిని ఏకాకిని చేసి, హిందువులకు సంబంధించిన సున్నితమైన అంశాలలో బిజెపి నోరెత్తకుండా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యంతో చేసినదిగా స్పష్టంగా తెలుస్తోంది. దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల తర్వాత వైసీపీ ప్రభుత్వ హిందూ వ్యతిరేక సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్రను సంకల్పించింది.
 
టీడీపీ కూడా అధికారంలో ఉన్నప్పుడు హిందూ వ్యతిరేక సిద్ధాంతాలను, మైనారిటీ ఓట్ బ్యాంకు రాజకీయాలు చేసి దేవాలయాలపై దాడుల విషయంలో బిజెపి ఆందోళన కార్యక్రమాల నేపధ్యంలో, కుహానా హిందుత్వ విధానాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం అనుకరించడం ప్రారంభించింది. ఈ నేపధ్యంలో, ఆలయాలపై దాడుల అంశాన్ని, మతమార్పిడుల అంశాన్ని పక్కదారి పట్టించడానికి, ప్రజల దృష్టి మళ్ళించడానికి, బిజెపిని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి, బిజెపి వ్యతిరేక పార్టీలు " వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొరకు ఆందోళన" అనే కల్పితమైన అపోహలతో రాజకీయ కుట్రను తెరమీదకు తీసుకురావడం బిజెపి గమనిస్తోంది.
 
ఎన్నో సంవత్సరాల పోరాటం, అనేక త్యాగాల ఫలితం అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్  వంటి సున్నితమైన అంశాన్ని, కేంద్ర ప్రభుత్వం యొక్క అంతిమ నిర్ణయం ఏమీ తెలియకుండానే ఒక్క ట్వీట్ ను ఆధారంగా చేసుకుని, ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను రాష్ట్రంలోని బిజెపి వ్యతిరేక పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కొరకు, రెచ్చగొడుతున్నాయి. ఆలయాల దాడుల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి వైసీపీ నేపధ్యంలో రచించిన కుట్రగా దీన్ని బిజెపి భావిస్తోంది.
 
బిజెపి- జనసేన కూటమి 2024లో తమకు గట్టి ప్రత్యామ్నాయం అవుతుందని భావించిన టీడీపీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఆలయాలపై దాడుల విషయాన్ని బిజెపి లేవనెత్తడాన్ని నిరోధించేందుకు గాను, వైసీపీ, టీడీపీ; వారి తోక పార్టీలైన కమ్యూనిష్టులు, కాంగ్రెస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో అభద్రతాభావాన్ని కలుగజేసి, అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. 
 
రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నాయకత్వంలో ఎపి బిజెపి ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించడానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అందజేసారు. ఆలయాలపై దాడులు, మతమార్పిడులను ప్రోత్సహించడం, పంచాయతీ ఎన్నికలలో బిజెపి అభ్యర్ధులను నామినేషన్లు వేయనీకుండా అడ్డుకోవటం, మాతృభాష అయిన తెలుగును అణగదొక్కి, పాఠశాల స్థాయిలో ఇంగ్లీషును ప్రవేశపెట్టడం వంటి అంశాలపై రాష్ట్ర బిజెపి ప్రతినిధులు జాతీయ నాయకులకు వివరించారు.
 
మూడు రోజుల పర్యటన మరియు విస్తృత సంప్రదింపుల తరువాత, రాష్ట్రంలోని దేవాలయాలపై దాడుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి మరియు బిజెపి ప్రతిష్టను దెబ్బతీసేందుకు మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊహాజనిత వివాదాన్ని స్వార్ధ  రాజకీయ ప్రయోజనాలకోసం సృష్టిస్తున్నారని  రాష్ట్ర బిజెపి బృందం అభిప్రాయ పడుతోంది.
 
కమ్యూనిస్టులు, వైసిపి, టిడిపి మరియు కాంగ్రెస్‌లు తమతమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులలో భయాందోళనలను కలగచేయటానికి చేస్తున్న పుకార్లతో ప్రక్కదారి పట్టవద్దని ఆంధ్ర ప్రదేశ్ బిజెపి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రయోజనాలు అతి ముఖ్యమైన అంశం అని, వారు ఎప్పుడూ సురక్షితంగా ఉంటారని ఎపి బిజెపి, ఉద్యోగులకు హామీ ఇస్తున్నది.