సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం నిర్వహిస్తామని, ఇందుకోసం దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్తా, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టితో కలిసి ఈవో రథసప్తమి పర్వదినం ఏర్పాట్లపై ప్రాథమిక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రథసప్తమి పర్వదినం నాడు శ్రీ మలయప్పస్వామివారు ఏడు ప్రధాన వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని, సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు ముగుస్తాయని తెలిపారు. చక్రస్నానం ఏకాంతంగా జరుగుతుందన్నారు.
అనంతరం భక్తులను ఏవిధంగా గ్యాలరీల్లోకి అనుమతించాలి, భద్రతపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని, అన్ని విభాగాల అధిపతులు ఈ పర్వదినానికి సమాయత్తం కావాలని సూచించారు.
అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవనంలో రథసప్తమి ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతులతో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశాల్లో ఏఎస్పీ మునిరామయ్య, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :
సూర్యప్రభ వాహనం ఉదయం 5.30 గం||ల నుంచి 8.00 గం||ల వరకు(సూర్యోదయం ఉదయం 6.38 గంటలకు)
చిన్నశేష వాహనం ఉదయం 9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు
గరుడ వాహనం ఉదయం 11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు
హనుమంత వాహనం మధ్యాహ్నం 1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు
చక్రస్నానం మధ్యాహ్నం 2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు
కల్పవృక్ష వాహనం సాయంత్రం 4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు
సర్వభూపాల వాహనం సాయంత్రం 6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు
చంద్రప్రభ వాహనం రాత్రి 8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు