గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (19:16 IST)

రెడ్‌క్రాస్ సేవలు మరింత వేగవంతం చేయాలి: గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్

కరోనా కష్టకాలంలో రెడ్‌క్రాస్ సేవలను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి పలు మినహాయింపులతో లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ ప్రజలను రెడ్‌క్రాస్ పక్షాన మరింత చైతన్యవంతులను చేయాలని సూచించారు. గవర్నర్ బుధవారం కలెక్టర్ల‌ల‌తో వీడియో కాన్సరెన్స్ (వీసీ) ద్వారా ప్రత్యేకంగా సమావేశ‌మ‌య్యారు.

గవర్నర్ అధ్యక్షతన పనిచేసే రెడ్‌క్రాస్, కరోనా విజృంభణ నేపధ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతుండగా, బిశ్వభూషణ్ వీటిని మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జల్లా పాలనాధికారులను ఆదేశించారు. జిల్లా స్ధాయిలో రెడ్ క్రాస్ సంస్ధలకు అయా జిల్లాల పాలనాధికారులు అధ్యక్షులుగా వ్యవహరిస్తుండగా గౌరవ గవర్నర్ వారికి దిశా నిర్దేశం చేసారు.

ప్రధానంగా కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజలను పెద్ద ఎత్తున ఇబ్బందుల పాలు చేస్తుండగా, గత మూడు నెలల కాలంలో రెడ్ క్రాస్ ద్వారా ఇటు రాష్ట్ర, జిల్లా స్ధాయిలో బాధిత ప్రజలకు ఎటువంటి సేవలు అందించారన్న దానిపై గవర్నర్ పూర్తి స్దాయి సమీక్ష నిర్వహించి మెరుగైన పనితీరును ప్రదర్శించిన వారిని అభినందించారు. ఈ క్రమంలో గవర్నర్ తన విచక్షణ నిధుల నుండి రూ.5 లక్షలను రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖకు విరాళంగా సమకూర్చారు.

ఉచిత వైద్య శిభిరాల నిర్వహణ మొదలు, మాస్క్ ల పంపిణీ, ప్రజలలో అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలపై గవర్నర్ దృష్టి సారించారు. వలస కార్మికుల విషయంలో రెడ్ క్రాస్ చేపట్టిన కార్యక్రమాల తీరు తెన్నులపై బిశ్వ భూషణ్ జిల్లా స్దాయిలో రెడ్ క్రాస్ బాధ్యులతో మాట్లాడారు. వారి కోసం చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపై నిశితంగా పరిశీలించారు.

ప్రత్యేకించి రక్త నిల్వల పరంగా రెడ్ క్రాస్ సొసైటీ మంచి సేవలు అందిస్తుండగా, కరోనా నేపధ్యంలో రక్తదాన శిబిరాల నిర్వహణ ఏ తీరుగా జరుగుతోంది, ప్రస్తుతం వివిధ రక్త నిధులలో ఉన్న నిల్వల పరిస్ధితి ఏమిటి అన్న దానిపై కూడా మాననీయ గవర్నర్ జిల్లా కలెక్టర్ల నుండి వివరాలు తీసుకుని, బౌతిక దూరం పాటిస్తూ రక్త దాన శిబిరాల నిర్వహించటంపై జిల్లా పాలనాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

జూన్ నెల చివరి వరకు ఆంక్షలతో లాక్ డౌన్ కొనసాగ నుండగా, ప్రత్యేకించి ఈ సమయంలోనే రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందన్న విషయాన్ని వారికి వివరించాలన్న గవర్నర్ ఈ క్రమంలో రెడ్‌క్రాస్ ఏ తరహా కార్యక్రమాలకు ప్రాధన్యత ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎకె ఫరీడాలతో చర్చించారు. 

మరోవైపు అంతర్జాతీయ బాలల సంస్ధ యూనిసెఫ్ తో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ ఇటీవల ప్రత్యేక అవగాహనా ఒప్పందం కుదుర్చుకోగా. దీనిని అనుసరించి రెడ్ క్రాస్ స్యచ్ఛంధ కార్యకర్తలకు సామర్ధ్య పెంపుపై అందిస్తున్న తీరుతెన్నుల గురించి గవర్నర్ ఆరా తీశారు.

రాజ్‌భవన్ నుండి సమావేశంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సొసైటీ  ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎ.శ్రీధర్ రెడ్డి, ఎకె ఫరీడా, తదితరులు హాజ‌ర‌వ‌గా, ఆయా జిల్లాల నుండి కలెక్టర్లు, రెడ్‌క్రాస్ జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.