రిపోర్టర్ దారుణహత్య
తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం ఎస్ అన్నవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాతా సత్యనారాయణను దారుణంగా హత్య చేశారు.
రిపోర్టర్ ను కత్తితో నరికి దుండగులు పరారైయ్యారు. తొండంగి అర్బన్ రిపోర్టర్‌గా సత్యనారాయణ పనిచేస్తున్నారు. దీంతో మృతుడి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం. ఈ కేసును సీరియస్ గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలంటు రాష్ట్ర డిజిపి కి సీఎం వైఎస్ జగన్ ఆదేశం.
జరిగిన ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ తో మాట్లాడిన డీజీపీ సవాంగ్. తక్షణం సంఘటన స్థలంలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటూ ఎస్పీకి డిజిపి ఆదేశం.
జర్నలిస్ట్ హత్య చాలా దారుణమైన ఘటన అని డిజిపి ఖండన. ఈ కేసును స్వయంగా పర్యవేక్షించి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలంటూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని డీజీపీ ఆదేశించారు.
విలేకరి హత్య ఆటవిక చర్య
"ఆంధ్రజ్యోతి విలేకరిగా తూర్పుగోదావరి జిల్లా తొండంగి ప్రాంతానికి పని చేస్తున్న కాతా సత్యనారాయణను పొడిచి చంపడం క్రూరమైన దుస్సంఘటన. ఇది ఆటవిక చర్యగా జనసేన భావిస్తోంది. ఈ సంఘటన జరిగిన తీరు చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నామా అని అనిపించకమానదు. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా వుంది.
ఇంత భయంకరంగా భయపెడితేనే తప్ప కలాలకు సంకెళ్లు వేయలేమని నిర్ణయానికి వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు కనిపిస్తోంది. తునికి సమీపంలోని టి.వెంకటాపురం గ్రామంలో సత్యనారాయణ ఇంటికి కూతవేటు దూరంలోనే నడిరోడ్డుపై ఈ హత్యకు పాల్పడ్డారంటే దీని వెనుక పెద్ద కుట్రే దాగి వుంటుందని అనుమానించక తప్పదు.
సత్యనారాయణపై నెల కిందట ఒకసారి హత్యాయత్నం జరిగి, అది పోలీసుల వరకు వెళ్లినప్పటికీ అతనికి రక్షణ కల్పించకపోవడం దారుణం. పాత్రికేయుడు సత్యనారాయణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం పక్షపాతం చూపకుండా దీని వెనుక ఉన్న దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని, సత్యనారాయణ కుటుంబానికి న్యాయబద్ధమైన పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.
సత్యనారాయణ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
పేర్కొన్నారు.