శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మార్చి 2024 (17:22 IST)

'సిద్ధం' సభకు ప్రజల సొమ్ము రూ.90 కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం జగన్ : వైఎస్ షర్మిల

ys sharmila
'సిద్ధం' సభల పేరుతో ఏపీలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేస్తుందని, ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్ల మేరకు వెచ్చిస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, 'సిద్ధం' సభల పేరుతో ప్రభుత్వం ఏకంగా రూ.600 కోట్ల మేరకు ఖర్చు చేసిందన్నారు. ఒక్కో సభకు రూ.90 కోట్ల మేరకు ఖర్చు చేస్తుందని ఆరోపించారు. 'సిద్ధం' సభల పేరిట ప్రభుత్వ ఆదాయాన్ని వైకాపా దోచుకుంటుందని మండిపడ్డారు. ఇదంతా ఎవరి సొమ్ము అని ఆమె ప్రశ్నించారు. 
 
తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గంపై అంతర్గతంగా చర్చ జరిగిందన్నారు. అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. గతంలో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. 
 
అలాగే, గత ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ వాగ్ధానం ఏమైందన్నారు. ఈ ఉద్యోగాల భర్తీపై తాము నిలదీస్తే భయపెడుతున్నారని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారని ఆమె నిలదీశారు. గృహ నిర్బంధాలు, అరెస్టులు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ వేశారంటూ వంగ్యాస్త్రాలు సందించారు.